జలగ పేరు వినగానే చాలా మంది భయపడతారు. మరి ఐదంగుళాల జలగ ఒక మనిషి ముక్కులో ప్రవేశించి నెలరోజుల పాటు ఉంటే ఆ పరిస్థితి వర్ణనాతీతం. అయితే ఇలాంటి ఘటనే ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌లో వెలుగు చూసింది.
రాంలాల్(56) అనే వృద్ధుడు నెలరోజుల నుంచి ముక్కు నొప్పితో బాధపడుతున్నాడు. ముక్కు నుంచి రక్తం కూడా వచ్చేది. దీంతో చాలా ఆసుపత్రులకు తిరిగి మందులు కూడా వాడాడు. ఎన్ని మందులు వాడినా అతడి పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు. తన సమస్య ఇంకా తీవ్రంగా ఉండటం వల్ల వృద్ధుడు శ్రీనగర్ కంబైండ్ హాస్పిటల్‌కు వెళ్లి చెకప్ చేయించుకున్నాడు.
ఆ ఆసుపత్రిలో ఉన్న ఈఎన్‌టీ వైద్య నిపుణులు బైనాక్యులర్ ద్వారా రోగిని పరీక్షించి చూశారు. అయితే ఆ వృద్ధుడి ముక్కులో ఐదంగుళాల జలగ ఉండటం చూసిన డాక్టర్ ఆశ్చర్యానికి లోనయ్యారు. ముక్కులో జలగ ఉండటం వల్లే అతడికి తీవ్రమైన నొప్పి వచ్చి ముక్కులో నుంచి రక్తం కారుతుందని వైద్యులు తెలిపారు. చాలాసేపు శ్రమించిన వైద్యులు.. వృద్ధుడి ముక్కులో నుంచి జలగను బయటకు తీసేశారు. కొద్దిసేపటి తర్వాత వృద్ధుడిని ఇంటికి పంపించేశారు.
"కొండ ప్రాంతాల్లో ఉండే గ్రామాలలో నివసించే ప్రజలు.. చెరువులు, నదులు వద్దకు పోయి నీటిని తెచ్చుకుని తాగుతారు. రాంలాల్ కూడా ఆ విధంగా తెచ్చుకున్న నీటిని తాగటం వల్ల అతని నోట్లో జలగ ప్రవేశించింది. అక్కడి నుంచి ముక్కులోకి వెళ్లింది. అయితే అతడి పరిస్థితిని సకాలంలో గుర్తించి తొలగించకపోయి ఉంటే శ్వాసనాళంలో జలగ రక్తం తాగి పెరిగిపోయి ఉండేది. అలా జరిగి ఉంటే రోగి పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారేది. రోగి ముక్కులో ఉన్న జలగను తీసేశాం. ప్రస్తుతం వృద్ధుడు సురక్షితంగా ఉన్నాడు" అని శ్రీనగర్ ఆసుపత్రిలో ఈఎన్‌టి డాక్టర్ దిగ్‌పాల్ దత్ చెప్పారు.