Laxmikant Parsekar News: గోవాలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గోవా మాజీ సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ భాజపాకు గుడ్‌బై చెప్పనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు టికెట్ ఇవ్వలేదని, త్వరలో తాను పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు పర్సేకర్.
"భాజపాలో కొనసాగాలని లేదు. ఇప్పటికైతే నేను పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా. తర్వాత ఏం చేయాలో త్వరలో నిర్ణయించుకుంటా." అని పర్సేకర్ పేర్కొన్నారు.
పర్సేకర్ 2002 నుంచి 2017 వరకు ప్రాతినిథ్యం వహించిన మండ్రేమ్ అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యే దయానంద్ సోప్టేను బరిలోకి దింపనుంది భాజపా. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సోప్టే.. పర్సేకర్‌పై గెలుపొందారు. 2019లో భాజపాలో చేరారు.
లక్ష్మీకాంత్ పర్సేకర్ 2014-17 వరకు గోవా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన ప్రస్తుతం గోవా ఎన్నికల్లో భాజపా మేనిఫెస్టో కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు.
34 మంది అభ్యర్థులతో గోవాలో ఇటీవల తొలి జాబితాను ప్రకటించింది భాజపా. ఫిబ్రవరి 14న గోవాలో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 40 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: భాజపాకు ఉత్పల్ పారికర్ గుడ్ బై.. స్వతంత్రంగా బరిలోకి..