Chennai laptop thief arrested: దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో విద్యార్థుల ల్యాప్టాప్స్ చోరీ చేస్తున్న యువకుడ్ని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. అతడు రోజూ 2 ల్యాప్టాప్లు కాజేస్తున్నాడని గుర్తించారు. నిందితుడి ఇంటి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆ యువకుడు చెప్పిన విషయాలు విని.. పోలీసులంతా ఖంగుతిన్నారు.
ఒక్క ఫిర్యాదుతో..: రుద్రేశ్.. చెన్నైలోని స్టాన్లీ వైద్య కళాశాల విద్యార్థి. కొద్దిరోజుల క్రితం కాలేజీలో అతడి ల్యాప్టాప్ కనిపించకుండా పోయింది. వన్నారపెట్టై పోలీస్ స్టేషన్లో రుద్రేశ్ చోరీ కేసు పెట్టాడు. కాలేజీ సీసీటీవీ కెమెరాల ఫుటేజీ పరిశీలించిన పోలీసులు.. ఓ కళాశాలతో సంబంధం లేని వ్యక్తి లోపల తిరుగుతున్నట్లు గుర్తించారు. అతడే ల్యాప్టాప్లు దొంగిలిస్తున్నాడని ప్రాథమికంగా నిర్ధరించారు. వెంటనే ఇన్స్పెక్టర్ యమున నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి.. కాలేజీలో మోహరించారు.
శనివారం పోలీసులు స్టాన్లీ ఆస్పత్రి పరిసరాల్లో గస్తీ కాస్తున్నారు. అదే సమయానికి అక్కడికి ఓ యువకుడు వచ్చాడు. సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది అతడేనని నిర్ధరించుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ప్రశ్నించారు. నిందితుడిని తిరువారూర్కు చెందిన తమిళ్సెల్వన్(25)గా గుర్తించారు. ల్యాప్టాప్ల దొంగతనం అతడి పనేనని నిర్ధరించుకున్న పోలీసులు.. విచారణలో సెల్వన్ చెప్పిన సంగతులు విని షాక్ అయ్యారు.
ప్రేమ.. కక్ష.. చోరీ..: పోలీసుల కథనం ప్రకారం.. తమిళ్సెల్వన్ దూరవిద్యలో ఇప్పటికే న్యాయశాస్త్రం చదివాడు. యూనివర్సిటీ ఆఫ్ దిల్లీలో బీఏ(ఎకనామిక్స్) చదువుతున్నాడు. కొన్నేళ్లుగా ఓ వైద్య విద్యార్థిని ప్రేమించాడు. అయితే ఆ లవ్ స్టోరీ ఫెయిలైంది. అందుకే వైద్య విద్యార్థులు అందరిపైనా సెల్వన్ పగ పట్టాడు. దేశంలోని ప్రతి మెడికల్ కాలేజీపైనా గురిపెట్టాడు. ఏ రోజు కళాశాలకు వెళ్లాలో ముందే ఓ 'టైమ్ టేబుల్' వేసుకున్నాడు. తన అవతారాన్ని మార్చుతూ, రోజూ ఓ కాలేజీకి వెళ్తూ.. నిత్యం సగటున రెండు ల్యాప్టాప్లు చోరీ చేస్తున్నాడు. వాటిని ఓ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా విక్రయిస్తున్నాడు. విచారణ తర్వాత చెమ్మన్చేరిలోని సెల్వన్ ఇంటికి వెళ్లిన పోలీసులు.. అప్పటికే చోరీ చేసి, విక్రయించడానికి సిద్ధంగా ఉంచని 31 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. ఏ రోజు ఏ కాలేజీకి వెళ్లాలని విషయాన్ని ఇంట్లో ఉన్న క్యాలెండర్లో రాసిపెట్టుకున్నాడని తెలిపారు.