Lalu prasad yadav health: రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. దిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయిన కొన్ని గంటల్లోనే మళ్లీ ఎమర్జెన్సీకి తరలించారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది. అయితే, ప్రస్తుతం ఆయనను సాధారణ వార్డుకు మార్చి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ జరిగింది: పశువుల దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ.. అనారోగ్యం కారణంగా రాంచీలోని రిమ్స్‌లో చేరారు. అక్కడే చాలా రోజులుగా చికిత్స పొందుతున్నారు. అయితే మంగళవారం ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనకు చికిత్స అందిస్తున్న చీఫ్ డాక్టర్ విద్యాపాటి.. దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించాలని సూచించారు. 'లాలూ శరీరంలో క్రియేటనైన్ స్థాయి 3.5 నుంచి 4.6కు పెరిగింది. బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ హెచ్చుతగ్గులకు లోనవుతోంది. షుగర్ లెవెల్స్ 150-200 మధ్య ఉన్నాయి. ఆయన కిడ్నీలు 15-20 శాతం సామర్థ్యంతోనే పనిచేస్తున్నాయి.' అని డాక్టర్ విద్యాపాటి తెలిపారు.
రిమ్స్ మెడికల్ బోర్డు సిఫార్సుల మేరకు మంగళవారం రాత్రి 9 గంటలకు లాలూను రాంచీలోని రిమ్స్ నుంచి దిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. రాత్రంతా లాలూను అత్యవసర విభాగంలో ఉంచి వైద్యం అందించారు. ఆరోగ్య పరిస్థితి కుదుటపడ్డాక బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు డిశ్చార్జి చేసినట్లు దిల్లీ ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. అయితే, బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో మళ్లీ అత్యవసర విభాగానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత సాధారణ వార్డుకు తరలించి డాక్టర్ డీ భోవ్మిక్ పర్యవేక్షణలో చికిత్స అందించారు.
జైలు నుంచి విడుదలకు తేజ్ ప్రతాప్ డిమాండ్: తన తండ్రిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆయన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్. పట్నాలో బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు తేజ్ ప్రతాప్. 'మా నాన్నను పదేపదే జైలులో పెట్టటం నేను చూశాను. ఈ కేసులో అక్రమంగా నగదును ఉపసంహరించటానికి ప్రాథమికంగా ప్రభుత్వ అధికారులదే బాధ్యత. వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వృద్ధాప్యంలో మా తండ్రి ఇబ్బందులు పడుతున్నారు.' అని పేర్కొన్నారు.
ఐదేళ్లు జైలు శిక్ష: రూ.139 కోట్లు విలువైన దాణా కుంభకోణం కేసులో లాలూను దోషిగా తేల్చిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. ఐదేళ్ల జైలు శిక్ష, రూ.60 లక్షల జరిమానా విధిస్తూ ఫిబ్రవరి 21న తీర్పు వెలువరించింది. వెంటనే పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. అనారోగ్య కారణాలతో ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి: 45ఏళ్ల భర్తను వదిలి.. 22ఏళ్ల ప్రేమికుడితో వెళ్లి.. 25సిమ్‌లు మార్చి..