ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాకు (Ashish Mishra Lakhimpur) 3 రోజుల పోలీస్ రిమాండ్ విధిస్తూ లఖింపుర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి సోమవారం విచారణ చేపట్టిన చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ జస్టిస్ చింతారామ్.. షరతుల మీద ఈ రిమాండ్కు అనుమతించారు. లాయర్ సమక్షంలోనే మిశ్రాను ప్రశ్నించాలని, నిందితుడిని ఎలాంటి వేధింపులకు గురిచేయవద్దని పోలీసులకు స్పష్టం చేశారు.
ఈనెల 9న 12 గంటల పాటు విచారించిన అనంతరం ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి ఆశిష్ మిశ్రా (Ashish Mishra Lakhimpur) సహా మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారని పోలీసులు వెల్లడించారు. నిందితుడు దర్యాప్తునకు సహకరించట్లేదని పేర్కొన్నారు. ఈ కారణంగా పోలీస్ రిమాండ్కు అనుమతించాలని కోరుతూ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు.
అయితే దీనిపై స్పందించిన ఆశిష్ మిశ్రా (Ashish Mishra News) తరపు న్యాయవాది.. మిశ్రా ఏ తప్పూ చేయలేదని, ఘటనకు సంబంధించిన 100కుపైగా ఫొటోలను, వీడియోలను పోలీసులకు ఇప్పటికే అందించామని స్పష్టం చేశారు.
అక్టోబరు 3న లఖింపుర్ ఖేరీలోని టికూనియా (Lakhimpur Kheri Incident) సరిహద్దు వద్ద జరిగిన ఘర్షణలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు రైతులు ఉన్నారు. ఆశిష్ మిశ్రా తన కారుతో రైతులను తొక్కించారని.. ఈ క్రమంలో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారని రైతులు ఆరోపిస్తున్నారు.
సెక్షన్ 302, 304ఏ, 147, 148, 149, 279, 120బీల కింద ఆశిష్ మిశ్రాపై కేసు నమోదు చేశారు పోలీసులు.
ఇదీ చూడండి : మహారాష్ట్ర మాజీ హోంమంత్రి ఇంట్లో సీబీఐ సోదాలు