బావిలో పడ్డ చిరుతపులిని అత్యంత సాహసోపేతంగా రక్షించారు ఓ మహిళా పశువైద్యురాలు. ధైర్యంగా బావిలోకి దిగి చిరుతను కాపాడారు. బోనులో కూర్చొని బావిలోకి దిగిన వైద్యురాలు.. చిరుతకు మత్తుమందు ఇచ్చి తనతో పాటే పైకి తీసుకుని వచ్చారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
ప్రమాదవశాత్తు బావిలో పడ్డ చిరుత
మంగళూరు, కటీలు సమీపంలో గల నిడ్డోడి ప్రాంతంలోని ఓ బావిలో ప్రమాదవశాత్తు చిరుతపులి పడిపోయింది. ఏడాది వయసున్న ఈ చిరుత.. రెండు రోజుల క్రితం అందులో పడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో పశువైద్యులకు సమాచారం అందించారు. బావి వద్దకు చేరుకున్నపశువైద్యుల బృందం చాకచక్యంగా వ్యవహరించి చిరుతను బయటకు తీశారు. అందులో మేఘన అనే పశువైద్యురాలు కీలక పాత్ర పోషించారు. మత్తుమందుతో నింపిన ఇంజక్షన్‌తో కూడిన గన్ను పట్టుకుని మేఘన ధైర్యంగా బావిలోకి దిగారు. చిరుతకు గన్‌తో మత్తుమందు ఇంజెక్షన్‌ను ఇచ్చారు మేఘన. అనంతరం స్పృహతప్పిపోయిన చిరుతను అటవీ అధికారులు బావిలో దిగి బోనులో ఎక్కించి పైకి తీసుకొచ్చారు. డాక్టర్ మేఘన, డాక్టర్ పృథ్వీ, డాక్టర్ నఫీసా, డాక్టర్ యశస్విలతో కూడిన డాక్టర్ల బృందం చిరుతకు వైద్యం చేశారు. చిరుత స్పృహలోకి వచ్చిన తర్వాత అటవీ అధికారుల సమక్షంలో అడవిలో వదిలిపెట్టారు.
![Lady Doctor Saved Leopard Cub In Karnataka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17749375_cheetah-2.jpg)
కాగా మహిళ వైద్యురాలు మేఘన సాహసాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో కొంచెం నిర్లక్షంగా వ్యవహరించినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని.. అయినా మహిళ డాక్టర్ ధైర్యంగా చిరుతను కాపాడారని అధికారులు చెబుతున్నారు.
![Lady Doctor Saved Leopard Cub In Karnataka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17749375_cheetah-1.jpg)