'దత్తా' అన్న తన పేరును 'కుత్తా'గా (కుక్క) మార్చారని బంగాల్లోని బంకురా జిల్లా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కారును వెంబడిస్తూ శనివారం నిరసన వ్యక్తం చేసిన ఓ వ్యక్తి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌గా మారాడు. రేషన్ కార్డులో తన పేరు తప్పుగా నమోదైందని అతను చేసిన నిరసనకు స్పందించిన అధికారులు ఎట్టకేలకు ఆ పేరును సరిదిద్దారు.
అసలేం జరిగిందంటే ?
బంగాల్లోని బంకురా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి రేషన్ కార్డ్‌లో పలుమార్లు తన పేరు తప్పుగా పడిందన్న ఆవేదనతో శనివారం వినూత్నంగా నిరసన చేపట్టాడు. ఆ వ్యక్తి అసలు పేరు శ్రీకాంతి కుమార్ దత్తా. అయితే రేషన్ కార్డులో మాత్రం ఆయన పేరు శ్రీకాంతి కుమార్ దత్తాకు బదులుగా 'కుత్తా' అని తప్పుగా అచ్చయ్యింది. దీంతో విస్తుపోయిన శ్రీకాంతీ ఆ ప్రాంతానికి జిల్లా మెజిస్ట్రేట్ వస్తున్నారని తెలిసి అక్కడికి చేరుకున్నాడు. కారు కనిపించిన వెంటనే చటుక్కున్న వెళ్లి కుక్కలా అరస్తూ ఉన్నాడు. దీంతో ఏమీ అర్థం కాక ఆ అధికారి కాసేపు చూస్తూ ఉండిపోయారు. తన పేరు మార్చాలంటూ అర్జీ పత్రాలతో అధికారి ఎదుట నిరసనకు దిగిన శ్రీ కాంతి మొర విన్న ఆ సదురు అధికారి విసుగు చెందకుండా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సమస్యను పరిష్కరించాలని స్థానిక అధికారులను ఆదేశించారు.
ఇదేం మొదటి సారి కాదు..
అతడి పేరు తప్పుగా ప్రింట్ అవ్వడం ఇదేం మొదటిసారి కాదని. గతంలో రెండుసార్లు ఇలాగే జరిగిందని శ్రీకాంతి ఆవేదన వ్యక్తం చేశాడు. తొలిసారి 'శ్రీకాంతి కుమార్ దత్తా' బదులు 'శ్రీకాంత మొండల్' అని రాశారట. అప్పట్లో తప్పును సరిచేయాలని జిల్లా అధికారులకు అర్జీ పెట్టుకుంటే.. శ్రీకాంతో దత్తా అని మార్చారని తెలిపాడు. దీంతో ప్రభుత్వం నిర్వహించిన గడప వద్దకే కార్యక్రమంలో అయినా తమ సమస్యకు ఓ సొల్యూషన్ దొరుకుతుందని భావిస్తే అక్కడే ఈ శ్రీకాంతి కుమార్ కుత్తా పేరు నమోదయ్యిందని అని బాధితుడు వాపోయాడు.