Fake POCSO Complaint: తన దుకాణం ముందు నుంచి కారు తీయాలని కోరినందుకు ఓ వ్యాపారిపై ఏకంగా పోక్సో కేసు నమోదు చేశాడు ఎస్సై. తన మైనర్ కుమార్తెను వ్యాపారి లైంగికంగా వేధించాడనే తప్పుడు ఫిర్యాదుతో కేసు పెట్టి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ సంఘటన కేరళ, కన్నూర్ జిల్లాలోని పయ్యనూర్‌లో జరిగింది.
ఇదీ జరిగింది..
ఆగస్టు 19న పయ్యనూర్‌లోని ఓ బేకరీలో కేక్ కొనుగోలు చేసేందుకు ఎస్‌ఐ వచ్చారు. ఈ క్రమంలో తన కారును పక్కనే ఉన్న టైర్ సర్వీస్ దుకాణం ముందు నిలిపాడు. ఆ దుకాణం మేనేజర్ షమీమ్.. కారు ఇతర వాహనాలు వెళ్లేందుకు అడ్డుగా ఉందని, వేరే చోట నిలపాల్సిందిగా ఎస్‌ఐని కోరారు. దీనిపై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ ఘటన జరిగిన మరుసటి రోజున యూనిఫాంలో ఉన్న ఓ పోలీసు అధికారి షమీమ్ దుకాణానికి వచ్చారు. కొవిడ్ ప్రోటోకాల్‌ను పాటించనందుకు కేసు నమోదు చేస్తానని బెదిరించారు. దానితో పాటు కేక్ కొనుగోలు చేయడానికి వచ్చిన సమయంలో కారులో ఉన్న ఎస్‌ఐ కుమార్తెను నోటికి వచ్చినట్లు మాట్లాడారని షమీమ్‌పై కేసు నమోదు చేశారు.
ఎస్‌ఐ తనపై తప్పుడు కేసు నమోదు చేశారని జిల్లా ఎస్పీకి, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు షమీమ్. ఆ తర్వాత కూడా షమీమ్ సోదరుడు షిహాబ్‌కు ఫోన్ చేసిన ఎస్‌ఐ మరోసారి బెదిరించారు.
ఈ విషయమై క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ ఎస్పీ దర్యాప్తు చేపట్టారు. ఆయన నివేదిక ఆధారంగా కన్నూర్ రూరల్ ఎస్పీ నవీనీత్ శర్మ శాఖాపరమైన దర్యాప్తు చేపట్టాలని డీఐజీ కే.సేతురామన్ ఆదేశించారు. స్పెషల్ బ్రాంచ్ విచారణలో షమీమ్‌ను కావాలని కేసులో ఇరికించేందుకు ఎస్‌ఐ ప్రయత్నించినట్లు తేలింది. అనంతరం క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఎస్‌ఐని బదిలీ చేశారు.
ఇదీ చూడండి: వైద్య వ్యర్థాల నిర్వహణ పెను సవాలే..