MLC Kavitha did not attend ED inquiry today : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ లిక్కర్ స్కామ్ రోజుకో విషయం బయట పడుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన ఈడీ, సీబీఐ అధికారులు వారిని విచారిస్తున్నారు. ఇటీవలే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా నోటీసులు జారీ చేశారు. ఈనెల 11న దాదాపు 8 గంటల పాటు ఆమెను విచారించారు. ఈనెల 16న మరోసారి విచారణకు హాజరుకావాలని అదే రోజున నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ కవిత.. మరోసారి ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.
విచారణకు హాజరుకాలేనని ఈడీకి ఎమ్మెల్సీ కవిత సమాచారం అందించారు. ఈడీ అడిగిన పత్రాలను న్యాయవాది భరత్ ద్వారా పంపారు. మహిళలు కార్యాలయానికి పిలిపించి విచారించకూడదని అన్నారు. ఈడీకి మరో లేఖ రాస్తూ.. ఆడియో, వీడియో విచారణకు తాను సిద్ధమని.. అధికారులు తన నివాసానికి వచ్చి విచారణ చేయవచ్చని తెలిపారు. తన ప్రతినిధిగా భరత్‌ను ఈడీకి పంపుతున్నానని చెప్పారు.
'మహిళలను కార్యాలయం పిలిపించి విచారించకూడదు. ఆడియో, వీడియో విచారణకు నేను సిద్ధం: కవితఅధికారులు నా నివాసానికి వచ్చి విచారణ చేయవచ్చు. ఈనెల 11న జరిగిన విచారణలో పూర్తిగా సహకరించా. ఈడీ ప్రశ్నలకు నాకు తెలిసిన మేరకు సమాధానాలు ఇచ్చా. ఈనెల 11న రాత్రి 8 గంటల వరకు విచారించారు. ఇవాళ మళ్లీ విచారణకు రావాలని ఈనెల 11న సమన్లు ఇచ్చారు. వ్యక్తిగతంగా రావాలని సమన్లలో పేర్కొనలేదు. నా ప్రతినిధిగా భరత్‌ను ఈడీకి పంపుతున్నాను. నా హక్కుల రక్షణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాను. నా పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈనెల 24 న విచారించనుంది.' అని కవిత ఈడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు కవిత తరఫు న్యాయవాది భరత్ మాట్లాడుతూ ఆమెను ఈడీ వేధిస్తోందని ఆరోపించారు. అన్యాయంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. కవిత అనారోగ్యంతో ఉన్నారని అసత్యప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మహిళను ఇంటి వద్దే విచారించాలని తెలిపారు. విచారణకు మళ్లీ ఎప్పుడు రావాలని ఈడీ చెప్పలేదని.. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని.. 24న విచారణ ఉందని వెల్లడించారు. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాల ప్రకారం ముందుకెళ్తామని న్యాయవాది భరత్ స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: