ఖైదీలకు కర్ణాటక ప్రభుత్వం శుభవార్త అందించింది. వాళ్లకు ఇచ్చే నెలవారి వేతనాన్ని మూడు రెట్లు పెంచుతున్నట్లు తెలిపింది. దీంతో దేశంలోనే ఖైదీలకు అత్యధిక వేతనాలు ఇస్తున్న ప్రభుత్వంగా కర్ణాటక నిలిచింది. పెంచిన వేతనాలు.. అన్ని రకాల శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలకు అమలవుతాయని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది.
ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం సంవత్సరానికి రూ.58 కోట్లు ఖైదీల జీతాల కోసం ఖర్చు చేస్తోంది. బెంగళూరు సహా రాష్ట్రంలో మొత్తం 54 జైళ్లు ఉన్నాయి. అందులో 3,565 మంది ఖైదీలు శిక్షలు అనుభవిస్తున్నారు. రాష్ట్ర హోం శాఖ ఈ ఖైదీలందరికి జీతాల చెల్లిస్తోంది.
ఖైదీలకు పెరిగిన జీతాలు ఇలా..
- నైపుణ్యం లేని ఖైదీలకు మొదటి సంవత్సరం రోజుకు రూ.524... నైపుణ్యం ఉన్న ఖైదీలకు రూ.548 చెల్లించనున్నారు. వీరికి వారాంతపు సెలవు కలుపుకొని నెలకు రూ.14,248 ప్రభుత్వం చెల్లిస్తుంది.
- రెండు సంవత్సరాల అనుభవం ఉన్న ఖైదీలకు రోజుకు రూ.615 వేతనం ఖరారు చేశారు. వీరికి వారంతపు సెలవు ఇచ్చి.. వేతనంగా రూ.15,990 ప్రభుత్వం చెల్లించనుంది.
- మూడు సంవత్సరాల అనుభవం ఉన్న ఖైదీలకు రోజుకు రూ.663 ఇవ్వనున్నారు. వీరికి వారంతపు సెలవుతో పాటు రూ. 17,238 వేతనం రూపంలో అందించనుంది.
కాగా అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రూపు-డీ ఉద్యోగులు, గార్మెంట్ కార్మికులు జీతాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. చాలా రోజులుగా ఆందోళన సైతం నిర్వహిస్తున్నారు. వారి డిమాండ్లను ప్రభుత్వం ఇంకా నేరవేర్చలేదు. ఖైదీలు జీతాలు పెంచమని అడగకున్నా, ఎటువంటి ఆందోళనలు చేయకున్నా భారీ స్థాయిలో వేతనాలు పెంచడంపై.. పలువురు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.