Bajrang Dal activist murder case: కర్ణాటక శివమొగ్గలో ఉద్రిక్తతలకు దారితీసిన బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఆరుగురు యువకులను అరెస్టు చేశారు. వారిని మహ్మద్ ఖాసిఫ్, సయ్యద్ నదీమ్, అసిఫుల్లా ఖాన్, రేహాన్ షరీఫ్, నిహాన్, అబ్దుల్ అఫ్నాన్గా గుర్తించారు. 12 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులదరినీ గుర్తించామని, త్వరలోనే వారందరినీ అరెస్టు చేస్తామని చెప్పారు డీజీపీ ప్రతాప్ రెడ్డి. ఇప్పటికే శివమొగ్గ పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ.. నిబంధనలు ఉల్లంఘించి పలువురు తుంగానగర్‌లో కొన్ని వాహనాలకు నిప్పంటించారని తెలిపారు.
సెక్షన్ 144ను మరో రెండు రోజులు పొడగిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ డా. సెల్వమణి ప్రకటించారు. ఈ సమయంలో పాఠశాలలు కూడా తెరవొద్దని సూచించారు.
ఇదీ జరిగింది..
శివమొగ్గలోని భారతీనగర్‌లో ఆదివారం రాత్రి కారులో వచ్చిన పలువురు దుండగులు.. బజరంగ్‌దళ్ కార్యకర్త హర్షను కత్తితో పొడిచి హత్యచేశారు. సోమవారం నిర్వహించిన హర్ష అంతిమయాత్రలో దాదాపు 5 వేలమంది పాల్గొనగా.. అల్లరి మూకలు రాళ్లు రువ్వాయి. ఈ ఘటనలో హింస చెలరేగి ముగ్గురికి గాయాలయ్యాయి. శివమొగ్గ సహా పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ఇలాంటి ఘటనలు వ్యాప్తి చెందకుండా జిల్లా ఎస్పీ సహా డిప్యూటీ కమిషనర్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు అదనపు డీజీపీ తెలిపారు.
హర్ష హత్య తర్వాత శివమొగ్గలో 14 హింసాత్మక ఘటనలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. వీటిపై ఇప్పటివరకు 3 ఎఫ్ఐఆర్లు నమోదుచేసినట్లు తెలిపిన పోలీసులు మరిన్ని కేసుల నమోదుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. హింసాత్మక ఘటనల్లో ధ్వంసమైన ద్విచక్రవాహనాలు, ఆస్తులకు సంబంధించిన యజమానులను గుర్తిస్తున్నట్లు వెల్లడించారు.
హర్షపై రెండు కేసులు..
బాధితుడు హర్షపై రెండు కేసులు ఉన్నట్లు శివమొగ్గ ఎస్పీ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. ఒకటి అల్లర్ల కేసు, మరోటి 2016-17లో మతపర మనోభావాలకు దెబ్బతీసిన కేసుకు సంబంధించిన అంశం అని వెల్లడించారు.
- హర్ష హత్యకు సంబంధించి హిజాబ్ అంశం సహా అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నట్లు కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు.
- కర్ణాటకలో హిజాబ్ వివాదానికి, ఈ హత్యకు సంబంధం ఉందని ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆర్.అశోక తెలిపారు.
- హర్ష హత్యకేసులో కుట్ర దాగి ఉందని ఈ కేసును ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని భాజపా డిమాండ్ చేస్తోంది.
ఇవీ చూడండి: బజరంగ్‌దళ్ కార్యకర్త హత్య- 144 సెక్షన్ విధింపు