Karnataka Accident Today : కర్ణాటకలోని చిక్కబళ్లాపుర్లో ఆగి ఉన్న సిమెంట్ లారీని టాటా సుమో వాహనం ఢీకొట్టగా.. 13 మంది మరణించారు. జాతీయ రహదారి నెం.44పై చిత్రావతి సమీపంలో గురువారం ఉదయం ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. టాటా సుమోలో మొత్తం 15 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. మృతుల్లో నలుగురు మహిళలు, 8 మంది పురుషులు, ఓ చిన్నారి ఉన్నట్లు చెప్పారు.
అయితే ఘటనాస్థలిని చిక్కబళ్లాపుర్ ఎస్పీ సందర్శించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండల వాసులని పోలీసులు తెలిపారు. వారంతా బెంగళారులోని హోంగసంద్రలో నివసిస్తున్నట్లు చెప్పారు. ఘటనాస్థలిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఏడుగురు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించినట్లు వెల్లడించారు. మిగిలిన ముగ్గురిలో ఒకరు మరణించగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. దట్టమైన పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ట్రక్కును ఢీకొన్న అంబులైన్స్..
Maharastra Road Accident : మహారాష్ట్రలోని బీద్ జిల్లాలో రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్.. ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో అంబులెన్స్‌లోని డాక్టర్‌తో సహా నలుగురు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం రాత్రి 11.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ధమన్‌గావ్ నుంచి అహ్మద్‌నగర్ వైపు వెళ్తున్న ట్రక్కు నుంచి అంబులెన్స్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ భరత్ సీతారాం లోఖండేతో పాటు మనోజ్ పంగు తిర్కుండే, పప్పు పంగు తిర్కుండే అక్కడికక్కడే మృతి చెందారు. డాక్టర్ రాజేశ్ బాబాసాహెబ్ జింజుర్కే చికిత్స పొందుతూ మరణించాడు. తీవ్రంగా గాయపడ్డ జ్ఞానదేవ్ సూర్యభాన్ ఘుమ్రే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు, ముంబయి నుంచి బీద్కు వెళ్తున్న సాగర్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో అస్థీ ఘటాన్ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు.