Kargil vijay diwas 2022: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు సైనిక అమరవీరులకు ఘనంగా నివాళి అర్పించారు. కార్గిల్ విజయ్ దివస్ సైనికదళాల అసాధారణ పరాక్రమానికి నిదర్శనమని రాష్ట్రపతి కొనియాడారు. మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వారందరికీ వందనాలు తెలిపారు. సైనిక అమరవీరులు, వారి కుటుంబ సభ్యులకు దేశ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హిందీలో ట్వీట్ చేశారు.
ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు కూడా కార్గిల్ అమరులకు నివాళి అర్పించారు. కార్గిల్ యుద్ధ సమయంలో తిరుగులేని దేశ భక్తి, అసమాన శౌర్యాన్ని ప్రదర్శించారంటూ ట్వీట్ చేశారు. అత్యున్నత త్యాగం చేసిన కార్గిల్ అమరవీరులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమర సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. "కార్గిల్ విజయం దేశ గౌరవానికి చిహ్నం. మాతృభూమి రక్షణలో తమ పరాక్రమాన్ని చాటుతున్న వీరపుత్రులందరికీ వందనాలు జై హింద్" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దేశ సరిహద్దుల్లో సైనికుల పరాక్రమం, ఆనాటి విజయంపై అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వ్యాఖ్యలతో కూడిన ఓ వీడియోను కూడా ట్యాగ్ చేశారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా సైనిక అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు. దిల్లీలోని జాతీయ యుద్ధస్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి సైనిక అమరవీరులకు సెల్యూట్ చేశారు. ఈ కార్యక్రమంలో సైనిక దళాధిపతి జనరల్ మనోజ్ పాండే, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ రాధాకృష్ణన్ హరికుమార్, వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి కూడా పాల్గొని అమరవీరులకు నివాళి అర్పించారు.
ఇదీ చూడండి : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అసలు పేరు ఏంటో తెలుసా?