మరణాంతరం తనను ఖననానికి బదులు దహనం చేయండి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సిద్ధేశ్వర స్వామీజీ వీలునామా రాశారు. అస్తికలను నది లేదా సముద్రంలో కలపాలని చెప్పారు. అంత్యక్రియలను నిరాడంబరంగా జరిపించాలని సూచించారు. వీటితో పాటు భక్తులకు చివరి సందేశం కూడా ఇచ్చారు. 2014లో గురిపౌర్ణమి నాడు ఈ వీలునామా రాశారు సిద్ధేశ్వర స్వామీజీ.
సోమవారం సిద్ధేశ్వర స్వామీజీ కన్నుమూశారు.
స్వామీజీ జీవిత సందేశం
"జీవితం అనేది అనుభవాల సమూహం. నిరంతర ఆలోచన, నిజాన్ని శోధించడం వల్ల అది పరిపూర్ణం అవుతుంది. ధర్మాన్ని పాటించడం వల్ల అది మీకు కలుగుతుంది. ఆత్మసంతృప్తికి అది ఒక కారణం. నాది ఓ సాధారణ జీవితం. గురుదేవ్ దాన్ని సృష్టించారు. దాన్ని స్వీకరించినవారు ఈ దేశంలో ఉన్న గౌరవనీయ వ్యక్తులు. శ్రేయోభిలాషులు, దయా హృదయం కలిగిన వారు, సాధారణ వ్యక్తులు. ప్రకృతిలా నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవితంలో నాకు లభించిన ప్రతిదానికీ నేను కృతజ్ఞుడ్ని. మబ్బులు కరగడం, పరదాలు తొలగిపోవడం, దీపాలు ఆరిపోవడం ఎలానో జీవితం కూడా ఓరోజు ఆగిపోతుంది. అనంతరం శూన్యం, నిశ్శబ్దం మాత్రమే మిగులుతాయి. దశాబ్దాలుగా బతకడంలో ఇసుమంతైనా నిజం లేదు. ఈ విషాయాన్ని నేను చూశాను, అనుభవించాను. నా జీవితం ఆగిపోయేముందు ఉవన్నీ కృతజ్ఞతతో గుర్తుతెచ్చుకోవాలి. అందుకే ఈ వీలునామా. ఈ లోకంలో నిజం, అబద్దం అనేది లేదు. సహజం, అసహజం అనేది లేదు. నేను నువ్వు అనే తేడా లేదు. అంత్యం ప్రణామాంజలి'' అని సందేశం ఇచ్చారు.
ప్రభుత్వ లాంఛనాలతో సిద్ధేశ్వర స్వామీజీ అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం జరగనున్నాయి. స్వామీజీ పార్థివ దేహాన్ని జ్ఞాన యోగాశ్రమంలో ఉంచారు. భక్తుల చివరి దర్శనం కోసం సైనిక్ పాఠశాల పరిసరాలలోకి మార్చనున్నారు. ఈ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా భక్తులు సంయమనం పాటించాలని సీఎం కోరారు.