West bengal job scam: బంగాల్లో ఇప్పటివరకు అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతలపైనే అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే తొలిసారి భాజపా నాయకులపై కేసు నమోదైంది. ఆ పార్టీ ఎంపీ జగన్నాథ్ సర్కార్, కేంద్రమంత్రి సుభాశ్ సర్కార్.. బంగాల్ కల్యాణీలోని ఎయిమ్స్‌లో 8 మందికి అక్రమంగా ఉద్యోగాలు ఇప్పించారని రాష్ట్ర సీఐడీ అభియోగాలు మోపింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
ఈ ఆరోపణలను ఎంపీ జగన్నాథ్ సర్కార్ ఖండించారు. ఇది టీఎంసీ కుట్ర అని, కావాలనే తమపై తప్పుడు ఆరోపణలు మోపుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు జరిగినా కేసులు నమోదు చేయట్లేదని, ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. టీఎంసీ నేతలు అవినీతిలో కూరుకు పోయారని, ఆ ఇమేజ్ను మార్చుకునేందుకు భాజపా నేతలపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని జగన్నాథ్ విమర్శించారు. ఉద్యోగాల నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పారు. నిబంధనల ప్రకారమే ఎంపిక జరిగిందని పేర్కొన్నారు. ఈ కేసులో ఒకవేళ సీఐడీ తనను విచారణకు పిలిస్తే తప్పకుండా హజరవుతానని స్పష్టం చేశారు.
అర్హులైన వారికే ఉద్యోగాలు ఇవ్వాలని కల్యాణీ ఎయిమ్స్ ఎదుట స్థానికులు కొద్ది నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. భాజపా ఎమ్మెల్యే బంకిం ఘోష్ తన కోడలికి ఎయిమ్స్‌లో అక్రమంగా ఉద్యోగం ఇప్పించారని అరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది బంగాల్ సీఐడీ. భాజపా ఎంపీలు జగన్నాథ్ సర్కార్, సుభాశ్ సర్కార్‌పై కూడా అభియోగాలు మోపింది.
ఇదీ చదవండి: భర్తను వదిలి 22 రోజులు సహజీవనం.. ఆపై బెదిరింపులు.. యువకుడి ఆత్మహత్య