జమ్ము కశ్మీర్లోని పూంచ్ జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కులో మంటలు చెలరేగి.. ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం భాటా ధురియన్ ప్రాంతానికి సమీపంలోని హైవేపై గురువారం జరిగింది. పిడుగుపాటు కారణంగానే ఈ పేలుడు సంభవించి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. జిల్లాకు 90 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ఆర్మీ, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడుకు గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే.. ఎటువంటి ఉగ్రకోణం ఇందులో లేదని అధికారులు స్పష్టం చేశారు. కాగా, ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు సమాచారం.
పూంచ్ సరిహద్దు జిల్లా కావడం వల్ల ఉగ్రమూకల చొరబాటు ప్రయాత్నాలు జరుగుతుంటాయి. ఈ నెల ప్రారంభంలోనే నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి పూంచ్ సెక్టార్‌లో పెద్ద చొరబాటు యత్నాన్ని భారత సైన్యం భగ్నం చేసింది. చొరబాటుదారులను వెంబడించే క్రమంలో ఓ వ్యక్తి చనిపోయాడు. మిగతా వారు అటవీ ప్రాంతంలోకి పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో భద్రతను కూడా పెంచింది భారత సైన్యం.
గత నెల మార్చిలో కూడా జమ్ము కశ్మీర్ పోలీసులతో భారత ఆర్మీ జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. తంగ్‌ధర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు ప్రయత్నించిన కొందరి ముష్కరుల ప్రయత్నాన్ని కూడా ఈ సెర్చ్ ఆపరేషన్లో తిప్పికొట్టి ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టారు. వీరి నుంచి 200 రౌండ్లకుపైగా గుండ్లు కలిగిన ఏకే రైఫిల్స్, మూడు మ్యాగజైన్లు, రెండు చైనా గ్రెనేడ్లు, మందులు, ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
టపాసుల గోదాములో మంటలు.. నలుగురు సజీవదహనం
గుజరాత్లోని అరవల్లి జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. మోదాసా పట్టణానికి సమీపంలో ఉన్న బాణసంచా గోదాములో గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలలో దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మీకులు అగ్నికి ఆహుతయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్మార్టం పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించినట్లు అరవల్లి పోలీసు సూపరింటెండెంట్ సంజయ్ ఖరత్ తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని సంబంధిత అధికారులు చెప్పారు.