Jahangirpuri news: గతవారం హింసాత్మక ఘటనలు జరిగిన దిల్లీలోని జహంగీర్‌పురిలో బుల్డోజర్లను మోహరించారు నార్త్ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ) అధికారులు. అక్కడ అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చేస్తున్నారు. రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. నిర్మాణాల కూల్చివేత నేపథ్యంలో ఉదయం నుంచి భారీగా పోలీసులను మోహరించారు అధికారులు. మహిళా సిబ్బందిని కూడా రంగంలోకి దించారు. రెండు, మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది.
Jahangirpuri bulldozers: అయితే నార్త్ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో భాజపా అధికారంలో ఉంది. దీంతో దిల్లీలో ప్రస్తుతమున్న శాంతియుత వాతావరణానికి విఘాతం కల్గించేందుకు భాజపా, హోంమంత్రి అమిత్ షా కుట్ర చేస్తున్నారని ఆప్ ఎమ్మెల్యే, దిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అమానాతుల్లా ఖాన్ ఆరోపించారు. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని, వారిని వేధించేందుకు రంజాన్ లాంటి పవిత్ర మాసంలో ఇలా చేయడం దారుణమన్నారు. ఈమేరకు ట్విట్టర్లో ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలతో దేశంలోని ప్రశాంత పరిస్థితులు మారే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే అనేక చోట్ల పరిస్థితులు బాగాలేవని చెప్పారు. భాజపా ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలన్నారు.
దిల్లీ వ్యాప్తంగా దురాక్రమణ వ్యతిరేక కార్యక్రమం కొనసాగుతుందని ఎన్ఎండీసీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ స్పష్టం చేశారు. అయితే గతంలో ఈ డ్రైవ్ నిర్వహించేందకు భద్రత కావాలని అడిగితే కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయారని చెప్పారు. ఈసారి పటిష్ఠ భద్రత కల్పిస్తున్నందు వల్ల ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన వాటిని మాత్రమే కూల్చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు స్టే..
అయితే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో జహంగీర్‌పురిలో బుల్డోజర్లతో జరుగుతున్న కూల్చివేతపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. దీనిపై తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పింది. అంతకుముందు దిల్లీ హైకోర్టులో కూడా ఈ విషయంపై పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే వాటిని విచారించేందుకు న్యాయస్థానం అనుమతించింది. కానీ కూల్చివేత ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని చెప్పింది. పిటిషన్లపై ఈరోజే విచారణ జరుపుతామని చెప్పింది. ఆ తర్వాత సుప్రీం జోక్యం చేసుకుని కూల్చివేతపై స్టే విధించింది.
జహంగీర్‌పురిలో ఈనెల 16న హునుమాన్ శోభాయాత్ర నిర్వహిస్తుండగా హింస చెలరేగింది. అల్లరి మూకలు రాళ్లురువ్వడం వల్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో పోలీసులు సహా పులువురు గాయపడ్డారు. ఆ మరునాటి నుంచి ఆ ప్రాంతంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. మరోవైపు బుల్డోజర్ ట్రెండ్ ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్లో బాగా పాపులర్ అయింది. నేరస్థులకు చెందిన ఆస్తులను బుల్డోజర్లను ఉపయోగించి కూల్చివేస్తున్నారు అధికారులు. నేరాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనం