జమ్ముకశ్మీర్ భద్రతా పరిస్థితులను సమీక్షించిన అనంతరం శ్రీనగర్‌లో యూత్ క్లబ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అక్కడి యువతను ఉద్దేశించి ప్రసంగించారు. కశ్మీర్ అభివృద్ధిలో పాలుపంచుకోవడం స్థానిక యువత బాధ్యత అని తెలిపారు. రెండేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చి యువకులతో మాట్లాడటం ఆనందంగా ఉందన్నారు.
2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేసి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం కారణంగా కశ్మీర్లో ఉగ్రవాదం, అవినీతి, వారసత్వ రాజకీయానికి చరమగీతం పాడినట్లయిందని షా అన్నారు. తీవ్రవాదం, రాళ్ల దాడులు గణనీయంగా తగ్గాయన్నారు. కశ్మీర్ శాంతికి విఘాతం కల్గించాలని చూస్తే ఎవరినైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ ప్రాంత అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.
" కశ్మీర్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగి తీరితుంది. ఆ తర్వాత ఎన్నికలు, అనంతరం కశ్మీర్‌కు రాష్ట్రహోదా కల్పిస్తాం. కశ్మీర్ యువతతో స్నేహం కోరుకుంటున్నా. ఇక్కడ కర్ఫ్యూ, ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై చాలా మంది ప్రశ్నించారు. ఒకవేళ కశ్మీర్లో కర్ఫ్యూ విధించకపోయి ఉంటే ఎంత ప్రాణనష్టం జరిగి ఉండేదో అంచానా కూడా వేయలేం. కర్ఫ్యూ వల్లే కశ్మీర్ యువతను కాపాడగలిగాం. మూడు కుటుంబాలు 70ఏళ్ల పాటు కశ్మీర్‌ను పాలించాయి. 40వేలమంది ఎందుకు చనిపోయారు? "
-హోంమంత్రి అమిత్ షా
కశ్మీర్ టు షార్జా విమానం..
కార్యక్రమం అనంతరం శ్రీనగర్ నుంచి షార్జాకు అంతర్జాతీయ విమాన సేవలను ప్రారంభిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. శనివారం నుంచే ఈ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. కేంద్రపాలిత ప్రాంతంలో పర్యటక అభివృద్ధితో పాటు పెట్టుబడులు రావడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. అలేగా కశ్మీర్లో హెలికాప్టర్ కార్యకలాపాల విధానాలను కూడా షా ప్రకటించారు. ఇవి కూడా శనివారం నుంచి అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: టీకా తయారీదారులతో మోదీ భేటీ- పరిశోధనలపై చర్చ