IT Employees Protest Chandrababu Arrest : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన నేపథ్యంలో హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు, టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. బాబు అరెస్ట్(Chandrababu Arrest) అక్రమం అంటూ ఐటీ కారిడార్‌లో పలు చోట్ల నిరసనలకు పిలుపునిచ్చారు. కేవలం కక్షపూరితంగా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు.
Police Restricts IT Employees Protest : చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే నిరసన చేస్తున్న ఉద్యోగులకు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. వారి ఆందోళనలపై పోలీసులు ఆంక్షలు విధించారు. మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రాంగూడలో ఆంక్షలు విధించినట్లు మాదాపూర్ డీసీపీ సందీప్ తెలిపారు.చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ 3 రోజులుగా ఐటీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చారు. అయితే వీరికి షాక్ ఇస్తూ మాదాపూర్ డీసీపీ ఆందోళనలపై ఆంక్షలు విధించారు. ఐటీ ఉద్యోగుల ఆందోళనలకు ఎలాంటి పోలీసు అనుమతి లేదని అన్నారు. అనుమతి లేకుండా ఆందోళన చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ధర్నాలు చేసి సామాన్య ప్రజలకు ఆటంకం కలిగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. ఆందోళన చేసే ఐటీ ఉద్యోగుల కంపెనీలకూ నోటీసులు పంపిస్తామని అన్నారు.
Protests in Hyderabad Over Chandrababu Arrest : ఈ మేరకు ఐటీ ఉద్యోగులు, తెలుదేశం నాయకులను ఉద్దేశిస్తూ ప్రకటన విడుదల చేసిన డీసీపీ.... సామాన్య ప్రజలకు, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని డీసీపీ సందీప్ హెచ్చరించారు. తెలుగుదేశం నాయకులతో కలిసి పలువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇవాళ, రేపు నిరనలకు పిలుపునిచ్చారు. పలు చోట్ల ఆందోళనలు చేపట్టాలని ప్రణాళిక రూపొందించారు.
మణికొండలో సాయంత్రం 6 గంటలకు, నానక్‌రాంగూడ ఓఆర్ఆర్లో శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి కారు ర్యాలీ, గచ్చిబౌలి ఐఐఐటీ జంక్షన్లో నిరసనలకు సన్నాహాలు చేసుకున్నారు. సదరు విషయం గ్రహించిన పోలీసులు.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల ఆందోళనలపై ఆంక్షలు విధించారు. ఆందోళనలు, ధర్నాల విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
నిత్యం కార్యాలయాలకే పరిమితమయ్యే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆందోళన బాటపట్టడంతో హైదరాబాద్ ఐటీ కారిడార్ సందడిగా మారింది. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలనే నినాదాలు ఆ ప్రాంగణమంతా మార్మోగుతున్నాయి. ఉద్యోగానికి సెలవు పెట్టి మరీ కొంతమంది ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రోడ్లపై బైఠాయించి.. చంద్రబాబు అరెస్ట్ అమానుషమని.. హైదరాబాద్ అభివృద్ధికి, నగరం సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నత స్థితిలో వృద్ధి చెందడానికి కారణం చంద్రబాబేనని నినదిస్తున్నారు. చంద్రబాబును విడుదల చేసేదాకా ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.