Irregularities in AP Voter List : ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమని చెప్పుకొచ్చే ఎన్నికల సంఘం ఏపీలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. పొరుగు రాష్ట్రాలు, రాష్ట్రంలోని ఒక చోటు నుంచి మరో చోటుకు ఓటు బదిలీ చేసుకునేందుకు ఏ మాత్రం అవకాశం కలిగించటం లేదు. ప్రత్యేకించి దిగువ స్థాయిలో బీఎల్వోలు ఈ దరఖాస్తులను నిలిపేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఓటు బదిలీకి సంబంధించి భారత ఎన్నికల సంఘం ఫారం-8 (Form-8) ద్వారా అవకాశం కల్పిస్తున్నా ఏపీలో మాత్రం అది ఓటర్ల బదిలీకి ఉపకరించటం లేదు.
Form-8 Does Not Use to Voters in Andhra Pradesh : 2024 ఓటర్ల తుది జాబితాలో చేరేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి దరఖాస్తు చేసుకున్న ఏపీ ఓటర్లకు కిందిస్థాయిలో బీఎల్వోలు, ఏఈఆర్వోలు చుక్కలు చూపిస్తున్నారు. దరఖాస్తులు పరిష్కరించకుండా పెండింగ్ లో పెట్టి ఓటు హక్కు కల్పించారా లేదా అన్న విషయాన్ని కూడా ఓటర్లకు తెలీకుండా నిలిపేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఉపాధి, ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన ఏపీ ఓటర్లు వేల సంఖ్యలో ఓటు బదిలీ కోసం ఫారం-8లను దరఖాస్తు చేశారు.
విజయవాడలో సీఈసీ పర్యటన - వైఎస్సార్సీపీ అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందా?
Fake Votes in AP : తెలంగాణా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, చత్తీస్ఘడ్ తదితర రాష్ట్రాలకు ఉపాధి , ఉద్యోగాల కోసం వెళ్లిన వారిలో కొందరు ఓటు బదిలీ కోసం దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా క్షేత్రస్థాయిలోని ఎన్నికల అధికారులు వాటిని పరిష్కరించటం లేదు. ఏపీలోని అధికార పార్టీ చేసిన ఫిర్యాదుతో ఈ దరఖాస్తుల పరిష్కారాన్ని ఎక్కడిక్కడే నిలిపేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ముంబై, పూణే సహా దేశంలోని వివిధ నగరాల్లో ఏపీకి చెందిన ఓటర్లు ఉద్యోగాలు చేస్తున్నారు. చాలా మంది పేదలు ఉపాధి కోసం అక్కడకు వలస వెళ్లిన పరిస్థితి.
AP Voter List 2024 : స్వస్థలాలకు వచ్చి ఓటు వేద్దామని ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసినా ప్రస్తుతం అప్రకటిత నిషేధంతో అవి పరిష్కారానికి నోచు కోవటం లేదు. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన స్థానికులకు ఇప్పుడు ఓటు వేయలేని పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ ఫిర్యాదు చేసిందన్న సాకుతో రాష్ట్రంలోని ఎన్నికల అధికారులు ఆయా దరఖాస్తులను పూర్తిగా పరిశీలించి అనంతరం ఆమోదించాలని చెప్పినా క్షేత్రస్థాయిలో సిబ్బంది మాత్రం ఇష్టానుసారం వ్యవహరిస్తున్న పరిస్థితి.
అక్రమంగా ఓట్లు తొలగింపు - జిల్లా యంత్రాంగాన్ని ఆశ్రయించిన పెద్దాపురం గ్రామస్థులు
మండల స్థాయిలోని ఎన్నికల అధికారులు, బీఎల్ఓలు ఇలా ఎక్కడికక్కడ ఫారం-8 దరఖాస్తులను పరిష్కరించకుండా నిలిపివేస్తున్నారు. దీంతో వేలాదిగా ఓటు బదిలీ కోసం వచ్చిన ఫారం-8 దరఖాస్తులు పెండింగ్ లో ఉండిపోయాయి. దీంతో వేలాది మందికి ఓటు హక్కు రాకుండా నిలిచిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఓటు హక్కు కల్పించాల్సిన అధికారులే ఓటు బదిలీ కోసం చేసుకున్న దరఖాస్తుల్ని పరిష్కరించకపోవటం దానికి సంబంధించిన సమాచారం ఏదీ బయటపెట్టకపోవటం అనుమానాలకు తావిస్తోంది. కనీసం ఏపీలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఓటును బదిలీ చేసుకునేందుకు చేసుకున్న దరఖాస్తులను అయినా ఆమోదించారో లేదో తెలియని దుస్థితి నెలకొంది. అయితే పొరుగు రాష్ట్రాల నుంచి స్వస్థలానికి వచ్చి ఓటు వేసేందుకు చేసుకున్న దరఖాస్తుల్ని ఎన్నికల అధికారులే పరిష్కరించకుండా పెండింగ్‌లో ఉంచటంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ బృందం ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఏపీలో ఎన్నికల సంఘం ఆదేశాలు అమలు కావడం లేదు - ఓటర్ల జాబితాలో అక్రమాలు : ఎంపీ గల్లా జయదేవ్