ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి(UN Human Rights Council) వేదికగా పాకిస్థాన్‌కు చురకలంటింటింది భారత్. ఉగ్రవాదులకు పాకిస్థాన్ బహిరంగంగా మద్దతు ఇస్తోందని, వారికి ఆర్థికంగా సాయం చేస్తోందని ఆరోపించింది. ఐరాస జాబితాలో ఉన్న ఉగ్రవాదులు సహా ఇతర ముష్కరులకు అండగా నిలవడం పాక్ ప్రభుత్వ విధానంగా ఉందని విమర్శించింది.
సిక్కులు, హిందువులు, క్రిస్టియన్లు సహా మైనార్టీల హక్కుల పరిరక్షణలో పాక్ విఫలమైందని భారత్ ఆరోపించింది. మైనార్టీ వర్గాలకు చెందిన వేలాది మంది మహిళలు, బాలికలు అపహరణ, బలవంతపు పెళ్లిళ్లు, మత మార్పిడులకు గురి అవుతున్నట్లు తెలిపింది. భారత్ ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమే కాకుండా శక్తివంతమైందని గుర్తు చేసింది. పాకిస్థాన్‌ను ఓ విఫలమైన దేశంగా అభివర్ణించిన భారత్... అటువంటి దేశం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన స్థితిలో తాము లేమని పేర్కొంది.
"ఉగ్రవాదులకు పాక్ బహిరంగంగా మద్దతు ఇస్తోంది. వారి శిక్షణకు, ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. మైనార్టీల హక్కులను పరిరక్షించడంలో పాక్ ఘోరంగా విఫలమైంది. అటువంటి దేశం నుంచి నీతులు నేర్చుకోవాల్సి స్థితిలో భారత్ లేదు. ఐరాస వేదికగా ఇలాంటి వాఖ్యలు చేయడం పాక్‌కు అలవాటుగా మారింది. వారి ప్రభుత్వం చేస్తున్న హక్కుల ఉల్లంఘనను కప్పిపుచ్చడానికి ఇతరులపై నిందలు మోపుతోంది. తద్వారా కౌన్సిల్ దృష్టిని మరల్చాలని ప్రయత్నింస్తోంది. ఇవి అన్నీ ఇందులో ఉన్నవారికి తెలుసు."
- పవన్ బాధే, ఐరాసలో భారత ప్రతినిధి
ఇదీ చూడండి: కలెక్టర్ ఎదుటే ఉమ్మిన వ్యక్తి.. ఆ తర్వాత..?