వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ చరిత్ర సృష్టించింది. టీకా పంపిణీలో 100కోట్ల మార్కును అందుకుంది(india vaccination count). జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సిన్ల పంపిణీ.. శరవేగంతో అక్టోబర్ 21 నాటికి 100కోట్లకు చేరింది.
తాజా రికార్డుపై నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడో దశ కరోనా(third wave in india) విజృంభించే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఇది ఊరటనిచ్చే విషయం అంటున్నారు.
100కోట్లు ఇలా..
దేశవ్యాప్తంగా జనవరి 16న టీకా పంపిణీ కార్యక్రమం మొదలైంది(india vaccination status). 10కోట్ల మార్కును అందుకునేందుకు 85రోజులు పట్టింది. 20కోట్ల మార్కును 45రోజుల్లో, 30కోట్ల మార్కును 29రోజుల్లో దాటేసింది. ఆ తర్వాత టీకా పంపిణీలో భారత్ దూసుకుపోయింది. 24 రోజుల తర్వాత 40కోట్ల డోసులు, 20రోజుల అనంతరం ఆగస్టు 6న 50కోట్ల మైలురాయిని చేరుకుంది. ఆ తర్వాత కేవలం 76రోజుల్లోనే 100కోట్ల మార్కును అందుకుంది.
దేశంలోని 75శాతం మంది కనీసం ఒక్క డోసు తీసుకున్నారు. 31శాతం మంది రెండు డోసులు తీసుకున్నట్టు అధికార వర్గాల సమాచారం.
దిల్లీ ఆసుపత్రికి వెళ్లిన మోదీ..
టీకా పంపిణీ 100కోట్లు దాటిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(pm modi news).. దిల్లీలోని ఆర్ఎమ్ఎల్ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడి సిబ్బందితో ముచ్చటించారు.
టీకా పంపిణీలో భారత్ కొత్త చరిత్రను లిఖించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
"భారత్ చరిత్రను లిఖించింది. దేశ శాస్త్ర, వ్యాపార సమర్థ్యం, 130కోట్ల మంది భారతీయుల స్ఫూర్తికి ఇది నిదర్శనం. 100కోట్ల టీకా మార్కు అందుకున్న భారతీయులకు శుభాకాంక్షలు. డాక్టర్లు, నర్సులు, ఈ ఘనత సాధించేందుకు కృషిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
"100కోట్ల టీకా పంపిణీ మార్కును అందుకున్న టీమ్ఇండియాకు శుభాకాంక్షలు. ఈ ఘనత సాధించేందుకు కృషి చేసిన ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, టీకా ఉత్పత్తిదారులు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు నా అభినందనలు. ఇంకా టీకా వేసుకోని వారు భయాన్ని వీడి వ్యాక్సిన్లు తీసుకోవాలి."
-- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి.
"100కోట్ల టీకా పంపిణీ మార్కును దేశం ఈరోజు అందుకుంది. దీంతో నయా భారత దేశ శక్తిసామర్థ్యాలను మరోమారు ప్రపంచానికి చాటిచెప్పింది. ఎన్నో సవాళ్లును జయించి ఈ మహాయజ్ఞంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు, ఆరోగ్య కార్యకర్తలకు నా ధన్యవాదాలు. ప్రతి పౌరుడి ఆరోగ్య, భద్రత కోసం ఎనలేని కృషిచేస్తున్న ప్రధాని మోదీకి నా శుభాకాంక్షలు."
-- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.
"కరోనాకు ఎక్కువగా ప్రభావితమైన ప్రజలను రక్షించేందుకు, అందరికీ సమానంగా టీకాలు లభించాలనే లక్ష్యాన్ని సాధించినందుకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత ఆరోగ్య కార్యకర్తలు, ప్రజలకు నా అభినందనలు."
-- టెడ్రోస్ అథనోమ్, డబ్ల్యూహెచ్ఓ చీఫ్.