2023లో నైరుతి రుతుపవనాల కారణంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం- ఐఎండీ అంచనా వేసింది. హిందూ మహాసముద్ర ద్విధ్రువ, ఉత్తర అర్ధగోళంలోని పరిస్థితుల కారణంగా ఎల్‌నినో ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. సీజన్ ద్వితీయార్థంలో ఈ ప్రభావం కనిపించవచ్చని వెల్లడించింది. మంగళవారం భారత వాతావరణ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. ఈ ఏడాది లోటు వర్షపాతం ఉంటుందని, కరవు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రైవేటు వాతావరణ సంస్థ అయిన స్కైమెట్ వెల్లడించిన మరుసటి రోజే ఐఎండీ ఈ మేరకు ప్రకటన చేసింది.
ఐఎండీ అంచనాల ప్రకారం..
- భారత్లోని వాయవ్య, పశ్చిమ, మధ్య, ఈశాన్య ప్రాంతాల్లో సాధారణం నుంచి లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
- తూర్పు భారతం, ఈశాన్య, వాయవ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం ఉంటుంది.
- వర్షాకాలంలో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడవచ్చు. సీజన్ ద్వితీయార్థంలో ఈ ప్రభావం కనిపించవచ్చు.
సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం.. 67 శాతం ఉందని ఐఎండీ వాతావరణ శాస్త్ర డైరెక్టర్ జనరల్ ఎం మోహపాత్ర వెల్లడించారు. ఉత్తరార్ధగోళంలో యురేషియాపై హిమపాతం ఉండే ప్రాంతం.. డిసెంబర్ 2022 నుంచి మార్చి 2023 వరకు సాధారణం కంటే తక్కువగా ఉందన్నారు. ఇది భారత్లో నైరుతి రుతుపవనాల వర్షపాతానికి అనుకూలమైనదిగా పరిగణించవచ్చని ఆయన వెల్లడించారు.
"భారత్లో నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణ వర్షపాతం కనిపిస్తుంది. ఇది దాదాపు 87 సెంటీమీటర్ల దీర్ఘకాల సగటులో 96 శాతంగా ఉండవచ్చు."అని భూశాస్త్ర శాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్ తెలిపారు. రుతుపవనాల వర్షాలపై ఆధారపడి ఎక్కువగా వ్యవసాయం చేసే భారత్కు.. ఐఎండీ అంచనాలు కాస్త ఉపశమనం కలిగించాయి. భారత్లో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలాన్ని నైరుతి రుతుపవనాల కాలంగా పరిగణిస్తారు.
అయితే భారత్లో ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ అయిన స్కైమెట్ సోమవారం ప్రకటించింది. కరవు ఏర్పడేందుకు 20శాతం అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఇందుకు కాస్త విరుద్ధంగా.. ఈసారి వర్షాలు సాధారణ స్థాయిలో ఉంటాయని ఐఎండీ తెలిపింది.
భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో 2019 రుతుపవనాల సీజన్‌లో 971.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2020లో వర్షపాతం 961.4 మిల్లీమీటర్లుగా ఉంది. 2021లో 874.5 మిల్లీమీటర్లు , 2022లో 924.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది.