IIT Delhi Drops Mid Examinations : విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు ఐఐటీ దిల్లీ కీలక నిర్ణయం తీసుకుంది. సెమిస్టర్లలోని ఒక సెట్ మిడ్ పరీక్షలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయంపై అంతర్గత సర్వే జరిపి దాని నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యా సంస్థ డైరెక్టర్ రంగన్ బెనర్జీ తెలిపారు.
"ఇంతకుముందు మేము ఒక సెమిస్టర్‌లో రెండు సెట్ల మిడ్ పరీక్షలు నిర్వహించే వాళ్లం. ప్రతి సెమిస్టర్ చివరిలో ఫైనల్ పరీక్ష.. ఇంకా అనేక నిరంతర మూల్యాంకన విధానాలు ఉండేవి. అయితే దీనిపై మేము అంతర్గత సర్వే నిర్వహించాము. అందరు విద్యార్థులు, అధ్యాపకుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా.. ఒక సెట్ మిడ్ పరీక్షలను నిలిపివేయాలని నిర్ణయించాము. కాబట్టి, ఇప్పుడు రెండు సెట్ల పరీక్షలు మాత్రమే ఉంటాయి"
-- రంగన్ బెనర్జీ, ఐఐటీ దిల్లీ డైరెక్టర్
అయితే ఇటీవల ఐఐటీ విద్యా సంస్థల్లో విద్యాప్రణాళిక (కరికులమ్), కఠినమైన షెడ్యూల్ కారణంగా మానసిక ఒత్తిడికి గురై విద్యార్థులు ఆత్మహత్య పాల్పడుతున్న కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐఐటీ దిల్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
విద్యా సంవత్సర పరీక్ష క్యాలెండర్.. విద్యార్థులకు ఏమాత్రం తీరిక లేకుండా చేసేలా ఉందని తాము భావించినట్లు రంగన్ తెలిపారు. అందుకే విద్యార్థులకు పరీక్షల భారం, ఒత్తిడిని తగ్గించాలని ఈ నిర్ణయం తీసుకున్నామని.. దాన్ని సెనేట్ కూడా ఆమోదించిందని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న సెమిస్టర్ నుంచి కొత్త పద్ధతి అమలవుతుందని చెప్పారు. ఇప్పటి నుంచి గరిష్ఠంగా ఉన్న 80 శాతం వెయిటేజీని రెండు పరీక్షలకు ఉంచారని వెల్లడించారు.
IIT Student Suicide Reason : విద్యార్థుల ఆత్మహత్యల గురించి కూడా రంగన్ మాట్లాడారు. 'ఐఐటీలలోకి విద్యార్థులు చాలా పోటీ ప్రక్రియ ద్వారా వస్తారు. అలా వారు బాగా చదివేవారు ఉన్న తరగతిలోకి వస్తారు. అక్కడ పోటీ నెలకొంటుంది. ఈ క్రమంలో వారికి వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలో చెప్పగలగాలి. దీనిపై మేము దృష్టి సారిస్తున్నాము. ఇప్పటికే మా కౌన్సిలింగ్ సెటప్‌ను విస్తరించాము. మా వద్ద స్టూడెంట్, ప్రొఫెషనల్ కౌన్సిలర్లు ఉన్నారు. దీని వల్ల చదువులో వెనుకబడ్డ విద్యార్థులను ట్రాక్ చేసి.. వారికి మార్గనిర్దేశం చేయవచ్చు. ఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా.. అది హృదయ విదారకమే. ఏ విద్యార్థి అయినా.. మానసికంగా ఒత్తిడిగి గురైనప్పుడు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు వారు సరైన కౌన్సిలింగ్, మెంటర్‌షిప్‌ను పొందగలిగేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి' అని రంగన్ వివరించారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో సమావేశమైన ఐఐటీ కౌన్సిల్.. ఫిర్యాదుల పరిష్కారానికి, మానిసిక కౌన్సిలింగ్ సేవలు పెంచడానికి, విద్యార్థులలో ఒత్తిడి తగ్గించడం, వారిలో ఫెయిల్ అవుతాం, తిరస్కరణకు గురవుతాం అనే భయాలను తగ్గించడానికి బలమైన వ్యవస్థ కావాలని నిర్ణయించింది. దీంతో పాటు విద్యార్థుల ఆత్మహత్యలు, విద్యార్థుల పట్ల వివక్ష ఆరోపణలు, విధ్యార్థుల మానసిక ఉల్లాసానికి భరోసా వంటి అంశాలపై కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
Suicide Cases In IITs : గత ఐదేళ్లలో ఐఐటీల్లోనే అత్యధికంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 2018 నుంచి 2023 వరకు దేశంలోని అగ్రశ్రేణి ఉన్నత విద్యా సంస్థల్లో 98 మంది ఆత్మహత్యలకు పాల్పడగా.. అందులో 39 కేసులు ఐఐటీల్లో నమోదైనవే.
Mtech Student Suicide case : 'కరోనా సమయంలో నా ఆత్మవిశ్వాసం దెబ్బతింది.. అందుకే..'