QS Ranking 2023 : ప్రఖ్యాత ఐఐటీ బాంబే అరుదైన ఘనతను సాధించింది. క్వాకరెల్లి సిమండ్స్ (QS) ప్రకటించిన తాజా ర్యాకింగ్స్లో ప్రపంచంలోనే అత్యున్నత 150 విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో ఐఐటీ బాంబే 149వ స్థానాన్ని కైవసం చేసుకుందని QS వ్యవస్థాపకులు, సీఈఓ నుంజియో క్వాకరెల్లి వెల్లడించారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 2,900 విశ్వవిద్యాలయాలు పోటీపడగా.. అందులో భారత్‌కు సంబంధించినవి 45 ఉన్నాయని వివరించారు. గత 9 ఏళ్లలో ఈ ర్యాకింగ్స్లో పోటీపడే సంస్థల సంఖ్య 297 శాతం పెరిగిందని చెప్పారు.
QS World University Rankings : ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన విద్యను అందించే విద్యా సంస్థల ర్యాంకింగ్స్‌ను క్వాకరెల్లి సిమండ్స్ ఏటా ప్రకటిస్తుంది. గతేడాది ప్రకటించిన జాబితాలో ఐఐటీ బాంబే 177 ర్యాంక్ సాధించగా.. తాజాగా 23 స్థానాలు ఎగబాకి 149 స్థానంలో నిలిచిందని QS తెలిపింది. 51.7 శాతం స్కోరుతో ఐఐటీ బాంబే తొలిసారిగా 150 ర్యాంకులోపు నిలిచిందని పేర్కొంది. అంతకుముందు 2016లో ఐఐఎస్ బెంగళూరు ఈ జాబితాలో 147వ స్థానంలో నిలిచింది.
అత్యున్నత విద్యా ప్రమాణాలు, ఉద్యోగ కల్పన, అంతర్జాతీయ పరిశోధనల్లో భాగస్వామ్యం, ఫాకల్టీ - స్టూడెంట్ రేషియో.. లాంటి 9 అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకింగ్స్‌ను కేటాయిస్తారు. ఇందులో ఐఐటీ బాంబే.. ఎంప్లాయర్ ఎంప్లాయర్ రెప్యుటేషన్ ర్యాంకింగ్ 69 స్థానాన్ని సాధించింది. ఎంప్లాయర్ రెప్యుటేషన్ విభాగంలో 81.9 శాతం స్కోరు చేయగా.. ఫ్యాకల్టీలో 73.1, అకడమిక్ రెప్యుటేషన్ 55.5, ఉద్యోగాల కల్పనలో 47.4, సుస్థిరతలో 54.9, ఫాకల్టీ - స్టూడెంట్ రేషియోలో 18.9, అంతర్జాతీయ ఫ్యాకల్టీలో 4.7, అంతర్జాతీయ పరిశోధనల్లో భాగస్వామ్యంలో 8.5, అంతర్జాతీయ విద్యార్థుల్లో 1.4 శాతం స్కోరు సాధించింది.
"భారత విశ్వవిద్యాలయాలు క్రమంగా మెరుగవుతున్నాయి. భారత్‌లోని ఐఐటీ, ఐఐఎస్‌లు మంచి పనితీరును కనబరుస్తున్నాయి. భారత్ నుంచి అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా ఎంపికైన ఐఐటీ బాంబేకు నా అభినందనలు. 780 ర్యాంక్ సాధించిన చంఢీగఢ్ యూనివర్సిటీకి శుభాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని భారత విశ్వవిద్యాలయాలు స్థానం సంపాదించాలని ఆశిస్తున్నాను."
--నుంజియో క్వాకరెల్లి, QS వ్యవస్థాపకులు, సీఈఓ