Agnipath Scheme: దేశవ్యాప్తంగా 'అగ్నిపథ్' పథకానికి అనూహ్య స్పందన లభిస్తోంది. భారత వాయుసేనలో ఖాళీలకు 7.50లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈమేరకు రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. భారత వాయుసేన చరిత్రలో ఇంత అత్యధిక స్థాయిలో దరఖాస్తులు రావడం ఇదే తొలిసారని చెప్పారు. భారత వాయుసేన అగ్నిపథ్ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తుల ప్రక్రియ జూన్ 24న ప్రారంభం కాగా.. జులై 5తో ముగిసింది. వాయుసేనలో అగ్నివీర్ తొలి బ్యాచ్‌ను ఈ ఏడాది డిసెంబరు 11న ప్రకటించనున్నారు.
20 శాతం వరకు మహిళలే.. సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం కింద ఇప్పటికే త్రివిధ దళాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ పథకం కింద మహిళలకు తగిన ప్రాధాన్యం దక్కనుందని తెలుస్తోంది. నావికా దళంలో దీనికింద మొదటి బ్యాచ్‌లో 20 శాతం మంది వరకు మహిళలు ఉంటారని భారత నేవీ అధికారులు మీడియాకు వెల్లడించారు. నావికా దళం ప్రకటించిన అర్హతలను వారు చేరుకోవాల్సి ఉంటుందని చెప్పారు. వారిని ఈ దళంలో వేర్వేరు శాఖలకు కేటాయించనున్నారు. ఈ ఏడాది 3000 మంది అగ్నివీరులను నియమించుకోవాలని భావిస్తున్నామని, ఇందులో మహిళలు కూడా ఉంటారని ఇటీవల నేవీ ప్రకటించింది.
పదివేల మంది మహిళలు దరఖాస్తు.. జులై 1 నుంచి నేవీ, ఆర్మీల్లోనూ ఈ పథకం కింద నియామక ప్రక్రియ మొదలైంది. కాగా.. అగ్నిపథ్‌లో భాగంగా నావికాదళంలో చేరేందుకు దాదాపు 10వేల మంది మహిళలు దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తొలిసారి నావికాదళంలో మహిళలను సెయిలర్లుగా నియమించుకునేందుకు భారత నేవీ అంగీకరించింది. అగ్నివీర్ పథకంలో భాగంగా సెయిలర్ల కోసం మహిళల నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. అవసరమైతే వారిని యుద్ధనౌకల్లోనూ విధులకు పంపనున్నట్లు పేర్కొంది.
పది శాతం చొప్పున రిజర్వేషన్లు.. త్రివిధ దళాల్లో నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం కింద 17.5 సంవత్సరాల నుంచి 21 ఏళ్ల వయసు కలిగిన యువతను కేంద్రం అర్హులుగా ప్రకటించింది. ఈ ఏడాదికి మాత్రం గరిష్ఠ పరిమితిని 23 ఏళ్లకు పెంచింది. కాగా, ఈ పథకం కింద నియమితులైన వారు నాలుగేళ్ల సర్వీసుపై పనిచేయాల్సి ఉంటుంది. వీరిలో 25శాతం మందిని శాశ్వత ప్రాతిపదికన మళ్లీ సర్వీసులోకి తీసుకుంటారు. నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చే అగ్నివీరులకు రక్షణశాఖ, కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లో 10 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తామని ఇప్పటికే కేంద్రం వెల్లడించింది.
ఇవీ చదవండి: 'అగ్నిపథ్'పై వచ్చే వారం సుప్రీం విచారణ
Agnipath Scheme: ఆర్మీ, నేవీలో రిక్రూట్మెంట్ ప్రక్రియ షురూ!