Rakhigarhi excavation: హరియాణా హిసార్ జిల్లా రాఖీగఢీలో భారత పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాల్లో.. 5వేల ఏళ్లనాటి హరప్పా నాగరికత స్మృతులు వెలుగుచూశాయి. ఈ తవ్వకాల్లో హరప్పా టౌన్ ప్లానింగ్‌ను అధికారులు గుర్తించారు. 5 వేల నుంచి 7 వేల ఏళ్ల నాడు ఇలాంటి సాంకేతికతతో నగరాలు నిర్మించారని తెలిపారు. రాఖీగఢీలో మొత్తం 7 గుట్టలు ఉన్నాయని.. వాటి తవ్వకం పనులు కొనసాగుతున్నాయని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జాయింట్ డైరెక్టర్ సంజయ్ మంజుల్ తెలిపారు. ఇప్పటి వరకు 3 సార్లు తవ్వకాలు జరగ్గా.. ప్రస్తుతం గుట్ట నంబర్ 1, 3, 7లో తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. ఈ తవ్వకాల్లో ఒకటో నంబర్ గుట్టపై.. రెండున్నర మీటర్ల వెడల్పు గల లేన్ వచ్చింది. ఇది హరప్పా ప్రజల జీవనశైలిని చూపుతుందని ఆయన వివరించారు. ఈ వీధికి ఇరువైపులా ముడి ఇటుకల గోడ ఉందని, దీనిని లంబ కోణంలో నిర్మించారని పేర్కొన్నారు. ఇది హరప్పా సంస్కృతి పట్టణ ప్రణాళికను చూపుతుందని సంజయ్ చెప్పారు. గోడకు ఇరువైపులా అనేక స్థాయిల్లో ఇళ్లు నిర్మించగా.. వాటిలో పాత్రలు, కుండలు, పొయ్యిలు ఉన్నాయి. తవ్వకాల్లో ఆభరణాల తయారీ కార్ఖానా బయటపడింది. ఇందులో మట్టిపాత్రలు, చిన్న రాగి గాజులు, రాగి చెవి ఆభరణాలు, గాజులు, టెర్రాకోటా గాజులు, కటింగ్‌కు ఉపయోగించే బ్లేడ్‌లు, బంగారు ఆభరణాలు ఇతర ముఖ్యమైన వస్తువులు లభించాయని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.
తవ్వకాల్లో జంతువుల అవశేషాలను కూడా కనుగొన్నట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో ఎద్దులు, ఏనుగులు, కుక్కలు ఉన్నాయి. ఏడో నంబర్ మట్టిదిబ్బ తవ్వకంలో.. మగ అస్థిపంజరం కూడా బయటపడిందని సంజయ్ మంజుల్ తెలిపారు. అస్థిపంజరం తల వెనుక హరప్పా కాలం నాటి పాత్రలు, గిన్నెలు, మూతలు, పెద్ద కుండలు, ప్లేట్లు, జాడీలు, స్టాండ్‌లో ఉంచాల్సిన పాత్రలు.. లభించాయి. ఇప్పటి వరకు మూడు ప్రదేశాలలో జరిపిన తవ్వకాల్లో మొత్తం 38 అస్థిపంజరాలు బయటపడ్డాయి. తాజాగా ఏడో నంబర్ సైట్‌లో ఇద్దరు మహిళల అస్థిపంజరాలను.. గుర్తించారు. డీఎన్ఏ విశ్లేషణ కోసం వాటిని పంపారు. వారి చేతుల్లో.. గాజులు, పూసలు, షెల్ కూడా లభ్యమయ్యాయి. సహజంగా తీర ప్రాంతంలో ఈ షెల్ దొరుకుతుంది. దీన్నిబట్టి ఇక్కడి ప్రజలు.. సుదూర వ్యాపారాలు చేసేవారని రుజువైంది.
సైట్ నంబర్ 3 వద్ద తవ్వకాల్లో.. కాలిన ఇటుకలతో కూడిన విస్తృత గోడ, డ్రెయిన్ కూడా కనిపించింది. ఇలాంటి కాలువ కనిపించడం.. ఇదే తొలిసారి. హరప్పా నాగరికతకు సంబంధించి రెండు నెలలపాటు అధ్యయనంచేసిన అధికారులు.. తవ్వకాల్లో బయటపడిన ఇళ్లను పక్కా ప్రణాళిక ప్రకారం నిర్మించినట్లు.. నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం మన నగరాల్లో చూస్తున్నట్లుగా.. అప్పట్లో కూడా ఇలాంటి ప్లానింగ్‌తో ఇళ్లు నిర్మించుకున్నారు. ఇళ్లన్నీ ఒకేలా ఉండడం సహా మురుగునీటి పారుదల కోసం డ్రైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఇందులో కనిపించే అన్ని దారులు.. నేరుగా ఉన్నాయి. రోడ్డుకిరువైపులా చాలా పెద్ద కుండలు కూడా కనిపించాయి. వాటిని.. చెత్త వేయడానికి ఉపయోగించారు. తద్వారా పరిశుభ్రతను చక్కగా ఉంచుకోవచ్చు. హరప్పా సంస్కృతి వారి జీవితాల్లో ఎంత పురోగతి సాధించిందో.. ఈ తవ్వకాల్లో గుర్తించామని ఆర్కియాలజికల్ డాక్టర్ సంజయ్ మంజుల్ అన్నారు. వారి పట్టణ ప్రణాళిక అద్భుతమని, ఆ సమయంలో ఇంజనీర్లు ఉంటారనడానికి ఆధారాలు లేనప్పటికీ.. ఈ నగరం నిర్మించిన విధానం చూస్తే.. పక్కా ప్లానింగ్ ఉన్నట్లు అర్థమవుతోందని తెలిపారు.
ఇదీ చూడండి: యునెస్కో జాబితాలో ధోలావీరా- వారసత్వ సంపదగా గుర్తింపు