Hightech Cannabis Cultivation : సాధారణంగా గంజాయిని నేలపైన సాగు చేయడం చూసి ఉంటాం. కానీ, ఇందుకు పూర్తి భిన్నంగా ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని కృత్రిమంగా సాగు చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హైటెక్ గంజాయి సాగును గుజరాత్ అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్ ప్రాంతంలో గుర్తించారు. ఈ ముఠాలోని ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా.. మిగిలిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
స్థానికుల ఫిర్యాదుతో సర్ఖేజ్ ప్రాంతంలోని ఆర్కిడ్ లీగసీ అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహించారు పోలీసులు. డీ2 అపార్ట్మెంట్లోని 1501, 1502 నెంబర్ ఫ్లాట్లలో తనిఖీలు చేపట్టగా.. అందులో అత్యాధునిక పద్ధతిలో గంజాయిని సాగు చేస్తున్నారు. నిందితులలో ఇద్దరు యువకులు, ఓ యువతి ఉన్నారు. ఫ్లాట్లలో కుండీలను ఉపయోగించి గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ గంజాయిని హైడ్రోఫోనిక్ రకానికి చెందినదిగా గుర్తించారు.
అత్యాధునిక పద్ధతిలో...
నిందితులు గంజాయి మొక్కలను అత్యాధునిక పద్ధతిని ఉపయోగించి గది ఉష్ణోగ్రతను నియంత్రించేలా ఏర్పాట్లు చేశారు. రెండు ఫ్లాట్లను రూ.35,000 లకు అద్దెకు తీసుకున్నారు. ఒక్కో ఫ్లాట్‌లో 100 మొక్కలను పెంచేలా ఏర్పాట్లు చేశారు. మొక్కలు తొందరగా పెరిగేలా అమైనో యాసిడ్ ఇంజక్షన్లను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. వీరి నుంచి 200 గంజాయి మొక్కల కుండీలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించినట్లు పోలీసులు తెలిపారు. 100 కుండీలలో 5 సెంటీమీటర్లు గంజాయి మొక్కలు పెరిగినట్లు చెప్పారు.
పోలీసులకు చిక్కారిలా
అయితే, కొద్ది రోజుల క్రితం వీరి ఫ్లాట్‌కు పెద్ద పార్సిల్ రావడం వల్ల స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. నిందితులు గంజాయిని విదేశాలకు విక్రయించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గంజాయిని సాగు చేసిన ప్రధాన నిందితుడు ఝార్ఖండ్ రాష్టంలోని రాంఛీకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఇతడు పరారీలో ఉన్నాడు. ముగ్గురు నిందితులను రవి ముసార్కా, విరేన్ మోదీ, రాతికా ప్రసాద్‌గా గుర్తించారు. వీరిలో ఒకరు సీఏ చదివారని పోలీసులు తెలిపారు. గతంలో గుజరాత్ యూనివర్సిటీలో గంజాయి సాగు కలకలం రేపిందని.. కానీ, ఇటువంటి పద్ధతిలో గంజాయిని సాగు చేయడం గుజరాత్లో మొదటిసారి అని పోలీసులు తెలిపారు.
'581 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయి'.. కోర్టులో పోలీసుల వింత వాదనలు!
తమిళనాడులో భారీ ఆపరేషన్.. రూ. 23కోట్ల విలువైన హెరాయిన్ సీజ్