సాధారణంగా ఒక కోడి రోజుకు ఎన్ని గుడ్లు పెడుతుంది? ఒక గుడ్డు లేదా రెండు గుడ్లు పెడుతుంది. ఇక్కడ మాత్రం ఓ కోడి ఏకంగా 31 గుడ్లు పెట్టింది. అదీ కేవలం 12 గంటల్లోనే. దీంతో అక్కడి వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వింత సంఘటన ఉత్తరాఖండ్లో జరిగింది.

వివరాల్లోకి వెళితే..
గిరీశ్ చంద్ర బుధాని అనే వ్యక్తి అల్మోరా జిల్లా బాసోత్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఈయన ఓ టూర్ అండ్ ట్రావెల్స్ సంస్థలో పనిచేస్తున్నారు. ఇతనికి ఒక కోడి ఉంది. అది ఇటీవల రోజుకు రెండు గుడ్లు పెట్టింది. అయితే డిసెంబర్ 25న వరుసగా గుడ్లు పెడుతూనే ఉంది. సాయంత్రం ఇంటికొచ్చిన గిరీశ్ ఆశ్చర్యపోయాడు. అప్పటికి కోడి ఇంకా గుడ్లు పెడుతూనే ఉంది. మొత్తంగా రాత్రి 10 గంటల వరకు 31 గుడ్లు పెట్టిందని గిరీష్ తెలిపారు. ప్రస్తుతం కోడి పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

"ఈ కోడికి రోజూ 200 గ్రాములు వేరుశనగ గింజలు తింటుంది. ఆ గింజలను దిల్లీ నుంచి తెప్పిస్తాను. గింజలతో పాటు వెల్లుల్లినీ పెడుతుంటాం" అని గిరీశ్ తెలిపారు. విషయం తెలుసుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు.. కోడిని పరిశీలించేందుకు గిరీశ్ ఇంటికి వచ్చారు. అతడి నుంచి వివరాలు తెలుకున్న అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయం చుట్టుపక్క ప్రాంతాలన్నింటికి పాకింది. దీంతో కోడిని చూడడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో గిరీశ్ ఇంటికి వస్తున్నారు.