మహారాష్ట్రలోని ముంబయి విమానాశ్రయంలో(Mumbai Airport news) గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా నేపథ్యంలో దేశీయ విమానాల్లో ప్రయాణించే వారిని ఎయిర్‌పోర్టులో ముందుగానే రిపోర్ట్ చేయాలని(mumbai airport covid guidelines) సంబంధిత అధికారులు సూచించారు. దీంతో సెక్యూరిటీ చెక్ కోసం గంటల తరబడి ప్రయాణికులు వేచి ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలో కొందరు తాము ప్రయాణించే విమానాలను సైతం మిస్ అయ్యారు. దీంతో సామాజిక మాధ్యమాల వేదికగా ప్రయాణికులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. " ముంబయి ఎయిర్‌పోర్టు జనంతో కిక్కిరిసిపోయింది. పనిచేయని యంత్రాలు, ప్రయాణికుల అసహనంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎయిర్‌పోర్టు సిబ్బంది తమ శక్తికి మించి పనిచేస్తున్నారు. ఇంత గందరగోళం తలెత్తడానికి కారణం ఎవరు? దయచేసి వారికి ట్యాగ్ చేయండి" అని అసహనానికి గురైన ఓ నెటిజన్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
'5పైసా డాట్ కామ్' సీఈఓ ప్రాకర్శ్ గగ్‌దానీ కూడా ఓ ఫొటోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. " ముంబయి విమానాశ్రయం గందరగోళంగా ఉంది. లోపలికి ప్రవేశించి చెక్-ఇన్ అవ్వడానికి కనీసం గంట సమయం పడుతోంది. దేశీయ విమానాల్లో ప్రయాణించాలనుకునే వారు రెండున్నర గంటల ముందు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నా విమానాన్ని ఎక్కే పరిస్థితి లేదు. ఇది దేశానికి నిజమైన వాణిజ్య రాజధాని" అని ఆయన వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా ఈ పరిస్థితిపై విమానాశ్రయ(Mumbai Airport news) అధికారులు స్పందించారు. ఈ ఆకస్మిక ప్రయాణికుల రద్దీకి పండుగ సీజన్ కారణమని పేర్కొన్నారు. దేశంలోని ఇతర విమానాశ్రయాల్లోనూ ఇలాగే రద్దీ నెలకొందని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదుల ముప్పు కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశామన్నారు. ప్రయాణికుల భద్రతకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఎయిర్‌పోర్టులోకి ప్రవేశించే వారిని త్వరగా తనిఖీ చేసి పంపించేందుకు అదనపు సిబ్బందిని నియమించామని విమానాశ్రయ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఆ దేశంలో ఇంధన సంక్షోభం.. బంకుల ముందు భారీ క్యూలు