TDP Mahanadu: రాజమహేంద్రవరం మహానాడు బహిరంగ సభ ప్రాంగణంలో భారీ వర్షం కురుస్తోంది. గాలి వాన ధాటికి బహిరంగ సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సహా ముఖ్య నేతల కటౌట్లు కూలిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. వర్షం జోరుతో మహానాడుకు తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు తడిసి ముద్దయ్యారు. అయినా ఎవరూ కదలకుండా సభా ప్రాంగణంలోనే ఉండిపోయారు. కుర్చీలను తలపై పెట్టుకొని సభను వీక్షిస్తున్నారకు. అదే స్ఫూర్తితో నాయకులు ప్రసంగాలు కొనసాగిస్తున్నారు. వర్షం కారణంగా మైదానంలో ఉన్న ఎల్ఈడీలు, ఎలక్ట్రానిక్ పరికరాలను ముందుజాగ్రత్తగా తరలించారు.
వర్షం కారణంగా ట్రాఫిక్‌లో చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఇరుక్కుపోయింది. వర్షంలోనే చంద్రబాబు బహిరంగ సభకు చేరుకున్నారు. భారీగా ఈదురు గాలలతో కూడిన భారీ వర్షం పడటంతో సభా ప్రాంగణలో ఏర్పాటు చేసిన నేతల కటౌట్ ఒక్కసారిగా వీఐపీ టెంట్‌పై పడిపోయింది. ఈ ఘటన జరిగిన కొద్ది సమయం క్రితం అందులో ఉన్న నేతలు బయటకు వచ్చారు. దీంతో సభ ప్రాంగణలో పెను ప్రమాదం తప్పింది.
భారీ వర్షంలోనూ టీడీపీ నేతలు ప్రసంగాలు కొనసాగించారు. ఈ వర్షంలో మహానాడు బహిరంగ సభకు వచ్చిన టీడీపీ కార్యకర్తలు తడిసి ముద్దైపోయారు. ఉదయం నుంచి ఎండతో కార్యకర్తలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడటంతో ఈ వర్షం అన్నగారు మనపై కురిపించిన పూల వర్షం అని కార్యకర్తలు అనుకుంటున్నారు.
ఎన్టీఆర్ శత జయంతి, మహానాడు వేడుకలకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణుల, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మహానాడు జన జాతరను తలపించింది. వేలాది వాహనాల్లో కార్యకర్తలు రావడంతో వేమగిరి-బొమ్మూరు రహదారులు కిక్కిరిసి పోయాయి. కార్యకర్తలు, టీడీపీ అభిమానులు బహిరంగ సభ ప్రాంగణానికి తరలి భారీగా వచ్చారు. కోతపెట నియోజకవర్గ నుంచి 8000 మంది కార్యకర్తలు బైక్ ర్యాలీగా అలాగే ఆత్రేయపురం నుండి 2000 మంది యువకులు బైక్, కార్ ర్యాలీతో సభకు తరలివచ్చారు.
భారీగా తరలివస్తున్న అభిమానులతో వేమగిరి కూడలిలో ట్రాఫిక్ స్తంభించింది. వేమగిరి కూడలి నుంచి రావులపాలెం వైపు దాదుపు 2 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు ఆగిపోవడంతో పాలకొల్లు, ఏలూరు, రావులపాలెం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కాలినడకన భారీ సంఖ్యలో సభకు చేరుకున్నారు.
టీడీపీ పేరు చెబితే పౌరుషం, పసుపు జెండా చూస్తే పూనకం: తెదేపా అంటే ఘన చరిత్ర ఉన్న పార్టీ.. వైకాపా అంటే గలీజు పార్టీ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. లక్ష కోట్లు ఆస్తి ఉన్నవాడు పేదవాడా అని ప్రశ్నించారు. లక్ష రూపాయల చెప్పులు వేసుకునే వాడు పేదవాడా అని నిలదీశారు. వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా అని ధ్వజమెత్తారు. సైకో జగన్ చిన్నప్పుడు చాక్లెట్ దొంగ...పెద్దయ్యాక బడా చోర్‌గా మారాడని దుయ్యబట్టారు. పేదల జేబులో డబ్బులు కొట్టేస్తున్నాడని ఆరోపించారు. పేదల ఆకలి అరుపులు ఆయనకి ఆనందాన్ని ఇస్తాయన్నారు. సైకో జగన్ పాలనలో యువత, మహిళలు, వృద్ధులు, రైతులు, కార్మికులు, ఉద్యోగస్తులు అందరూ బాధితులేనన్నారు. యువగళం పాదయాత్ర అడ్డుకోవడానికి సైకో జగన్ రాజారెడ్డి రాజ్యాంగం ప్రయోగిస్తే తాను అంబేద్కర్ గారి రాజ్యాంగంతో సమాధానం చెప్పానన్నారు. కార్యకర్తకు కష్టం వస్తే మీ లోకేశ్ ఆగడు... కార్యకర్త ఇబ్బందుల్లో ఉంటే సైకో జగన్ స్పందించడని ఎద్దేవా చేశారు.
తెదేపా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కడిని వదిలి పెట్టను.. అమలాపురంలో ఉన్నా అమెరికాలో ఉన్నా పట్టుకొచ్చి లోపలేస్తామని హెచ్చరించారు. పోరాటం మన పసుపు సైన్యం బ్లడ్ లో ఉందన్న లోకేశ్ ప్రతిపక్షంలో పోరాడిన ప్రతి కార్యకర్త బాధ్యత తనదని హామీ ఇచ్చారు. పేదలు ఎప్పటికీ పేదరికంలో ఉండాలి అనేది సైకో జగన్ కోరిక అని మండిపడ్డారు. పేదరికం లేని రాష్ట్రం చూడాలి అన్నది మీ లోకేశ్ సింగిల్ పాయింట్ ఎజెండా అని స్పష్టం చేశారు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఉరి తీసి భూమిలో పాతేద్దాం, సైకోని ప్యాలస్‌లో పెట్టి పర్మినెంట్‌గా తాళం వేద్దామని శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ పేరు చెబితే పౌరుషం, పసుపు జెండా చూస్తే పూనకం వస్తదన్నారు. తెలుగుదేశం పార్టీ కంచుకోటకు కాపలా కాస్తున్న పసుపు సైన్యానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అన్నారు. గోదారొళ్ల యటకారం, మమకారం రెండూ సూపర్ అని అభినందించారు. తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన మూడు అక్షరాల పేరు ఎన్టీఆర్ అని కొనియాడారు. కష్టం వస్తే ప్రజల కన్నీరు తుడిచింది ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీఆర్‌కి హిస్టరీ ఉంది.., పార్టీని నడుపుతున్న బాబుకి క్యాలిబర్ ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ, మన అధినేతల రికార్డులు కొట్టే మగాడు పుట్టలేదు, పుట్టడని లోకేశ్ అన్నారు.