Hearing on Chandrababu Bail Petition Adjourned: నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో(Skill Development Case) బెయిలు కోసం ఏసీబీ కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు మరో 5 రోజులు పోలీసు కస్టడీకి ఇవ్వాలన్న సీఐడీ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ కేసుతో ముడిపడిన అన్ని పిటిషన్లను అక్టోబర్ 4కు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలుచేసిన ఎస్ఎల్పీ(SLP) అక్టోబర్ 3కు వాయిదా పడినందున ఏసీబీ కోర్టు ముందున్న పిటిషన్లను వాయిదా వేయాలని ఇరువైపుల న్యాయవాదులు కోరారు. అందుకు అంగీకరించిన ఏసీబీ కోర్టు మొదట అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. ఆ తర్వాత 4కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ నిర్ణయం కోసం న్యాయవాదులు ఎదురుచూడటం వల్ల బెయిలు, పోలీసు కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ కొంత ఆలస్యమైంది. ఎస్ఎల్పీ అక్టోబర్ 3కు వాయిదా పడిందని తెలియడంతో ఇరువైపుల న్యాయవాదులు ఏసీబీ కోర్టుకు వచ్చి ఆ విషయాన్ని తెలిపారు. మధ్యంతర బెయిలు కోసం సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్(Chandrababu Bail Petition) వేశారన్న అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అక్కడ ఓ బెయిలు పిటిషన్, ఏసీబీ కోర్టులో మరో బెయిలు పిటిషన్ వేశారని అభ్యంతరం తెలిపారు. దీనిపై స్పందించిన చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే ఇంటీరియం రిలీజ్ కోసం పిటిషన్ మాత్రమే వేశామన్నారు. దానిని బెయిలు పిటిషన్‌గా పరిగణించడానికి వీల్లేదన్నారు. ఈ సందర్భంలో బెయిలు, పోలీసు కస్టడీ పిటిషన్లలో ఏది ముందు వినాలనేదానిపై ఇరువైపుల న్యాయవాదుల మధ్య వాడీవేడిగా వాద, ప్రతివాదనలు జరిగాయి. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ అక్టోబర్ 3కు వాయిదా పడినందున ప్రస్తుత పిటిషన్లను అక్టోబర్ 5కు వాయిదా వేయాలని ఇరువైపుల న్యాయవాదులు సమ్మతి తెలిపారు. అందుకు అంగీకరించిన న్యాయస్థానం 5కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
కొద్దిసేపటికే తిరిగొచ్చిన అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పోలీసు కస్టడీ పిటిషన్‌పై వాదనలు వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం తనను ఆదేశించిందని, తాను వాదనలు వినిపిస్తానని కోర్టును కోరారు. న్యాయస్థానం కూడా అంగీకరించింది. ఈ సందర్భంలో అదనపు ఏజీ వైఖరిపై చంద్రబాబు తరఫు న్యాయవాదులు గింజుపల్లి సుబ్బారావు తదితరులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇరువైపుల న్యాయవాదుల సమ్మతి మేరకు వాయిదా పడిన కేసులో వాదనలు వినిపిస్తానని అదనపు ఏజీ చెప్పడం కోర్టుల ఔన్నత్యాన్ని దిగజార్చడమేనన్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టు హాలు నుంచి బయటికి వెళ్లిపోయారు. విచారణ వాయిదా వేయాలంటే రాతపూర్వకంగా మెమో దాఖలు చేయాలని న్యాయస్థానం కోరడం సరికాదని న్యాయవాది మట్టా జయకర్ అన్నారు. ఆ విధానం చట్ట నిబంధనల్లో లేదన్నారు.
వాయిదాలు కోరే విషయంలో నిమిషానికి ఓ మాట మారుస్తున్నందున మెమో వేయాలని కోరినట్లు న్యాయాధికారి తెలిపారు. అందులో తప్పేముందన్నారు. కొద్దిసేపటి తర్వాత కోర్టు హాల్లోకి వచ్చిన అదనపు ఏజీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తాను ఒప్పించానని, మొదట అనుకున్న ప్రకారం విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేయాలని అన్నారు. బయటికివెళ్లి మరికొద్ది సేపటికి తిరిగొచ్చిన ఏఏజీ విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేయాలని అభ్యర్థించారు. దీంతో పిటిషన్లపై విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేస్తున్నట్లు న్యాయాధికారి హిమబిందు ప్రకటించారు. ఆ రోజు రెండు పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం వెల్లడిస్తానన్నారు.