చిన్న పిల్లలు తెలియనితనంతో తమ చేతికి దొరికిన చిన్నచిన్న వస్తువులను మింగేస్తుంటారు. అయితే మహారాష్ట్రలో ఓ చిన్నారి ఏకంగా హనుమంతుడి విగ్రహాన్నే మింగేసింది. అదేంటీ హనుమంతుడ్ని మింగడమేంటని ఆశ్చర్యపోతున్నారా! అవును.. ఓ నాలుగేళ్ల పాప తన మెడలో కట్టి ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని పొరపాటున మింగేసింది. దీంతో ఆ విగ్రహం చిన్నారి గొంతులో ఇరుక్కుపోయింది. అయితే ఆ పాప గొంతులో ఇరుక్కున్న విగ్రహాన్ని తొలగించి వైద్యులు చిన్నారిని కాపాడారు.
అసలేం జరిగిందంటే..?
హింగోలీ జిల్లాలో ఈ వింత ఘటన వెలుగుచూసింది. నాలుగేళ్ల చిన్నారి పొరపాటున తన మెడలో కట్టి ఉన్న 3 అంగుళాల హనుమంతుడి విగ్రహాన్ని మింగింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ పాప మింగిన ఆ విగ్రహం పొట్టలోపలి వెళ్లకుండా గొంతులో అడ్డంగా ఉండిపోయింది. దీంతో పాప ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యింది. వెంటనే ఆ చిన్నారి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకుని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చిన్నారి పరిస్థితిని గమనించిన అక్కడి డాక్టర్ నాందేడ్‌లోని గెలాక్సీ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. అక్కడికి వెళ్తే తప్పకుండా చిన్నారి గొంతులో ఉన్న విగ్రహాన్ని తొలగిస్తారని ఆ డాక్టర్ వారికి చెప్పారు. దీంతో వారు తమ పాపను హుటాహుటిన నాందేడ్‌లోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
అయితే ఆ చిన్నారికి గొంతు నొప్పి ఎక్కువవ్వడం వల్ల.. కుటుంబ సభ్యులు ఆందోళన చెందడం మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న డాక్టర్ నితిన్ జోషి.. కేవలం 1:10 నిమిషాల్లోనే ఆ చిన్నారి గొంతులో ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని బయటకు తీసి.. పునర్జన్మను అందించారు. ఆ హనుమంతుడి విగ్రహాం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు పాప గొంతులోనే ఉంది. అయితే చిన్నారి ప్రాణాలు కాపాడిన డాక్టర్ నితిన్ జోషి.. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారి మెడలో ఏమైనా వస్తువులు, దేవుడు విగ్రహాలు కట్టే ముందు జాగ్రత్తగా వ్యవహించాలని వారికి తెలిపారు.
కృష్ణుడ్ని మింగేసిన వీర భక్తుడు!
కొంతకాలం క్రితం కర్ణాటకలో కూడా ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. బెళగావికి చెందిన ఓ 45 ఏళ్ల వ్యక్తి పొరపాటున కృష్ణుడి విగ్రహాన్ని మింగాడు. నిత్యం బాలకృష్ణుడ్ని పూజించే ఆ వ్యక్తి.. ఓ రోజు నైవేద్యంగా ఉంచిన పంచామృతాన్ని తీర్థంగా తీసుకున్నాడు. అయితే ఆ తీర్థంతో పాటు కృష్ణుడి విగ్రహాన్ని కూడా మింగేశాడు. అయితే ఆ వ్యక్తి ఈ విషయాన్ని గుర్తించలేదు. కొంతసేపటికి అతడి గొంతులో నొప్పి, వాపు రావడం వల్ల అనుమానం వచ్చి డాక్టర్ వద్దకు వెళ్లగా అసలు విషయం బయటపడింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.