Ambulift Rajkot Airport: అనారోగ్యం కారణాలతో కదల్లేని పరిస్థితుల్లో ఉన్నవారు చక్రాల కుర్చీలకు పరిమితమైన దివ్యాంగులు, స్ట్రెచర్ మీద ఉండే రోగుల కోసం.. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కొత్త సౌకర్యాన్ని తీసుకొచ్చింది. వారిని నేరుగా.. విమానాల్లోకి ఎక్కించేందుకు అవసరమైన యాంబులిఫ్ట్ సౌకర్యాన్ని దేశంలోని 14 విమానాశ్రయాల్లోకి అందుబాటులోకి తెచ్చింది. సుగమ్య భారత్ అభియాన్‌లో భాగంగా అన్ని రకాల ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయం కల్పించాలన్న ఉద్దేశంతో ఏఏఐ 20 యాంబులిఫ్ట్‌లను కొనుగోలు చేసింది. ఏరోబ్రిడ్జి అందుబాటులో లేని విమానాలకు ఈ లిఫ్ట్ సౌకర్యాన్ని కల్పిస్తారు. ఈ ఒక్కో లిఫ్ట్‌లో 6 చక్రాల కుర్చీలు, 2 స్ట్రెచర్లను ఒకేసారి ఉపయోగించవచ్చు. వెలుతురు సక్రమంగా ప్రసరించడంతో పాటు ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థను అమర్చారు. ఒక్కో యూనిట్‌కు రూ. 63 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. నామమాత్రపు ఛార్జీలతో యాంబులిఫ్ట్ సౌకర్యాన్ని ఏఏఐ అందుబాటులో తెచ్చింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా యాంబులిఫ్ట్‌లను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు.
ప్రస్తుతం రాజ్‌కోట్, విజయవాడ, దేహ్రాదూన్, గోరఖ్‌పుర్, పట్నా, బాగ్‌డోగ్రా, దర్భంగా, ఇంఫాల్, పోర్ట్‌బ్లెయిర్, జోధుపుర్, బెళగావి, సిల్చార్, ఝార్సుగూడ, హుబ్బళ్లి విమానాశ్రయాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. మరో 6 ఎయిర్‌పోర్టుల్లో త్వరలో తీసుకురానున్నట్లు పేర్కొంది. దిమాపుర్, జోర్హాట్, లేహ్, జామ్‌నగర్, భుజ్, కాన్పుర్ విమానాశ్రయాల్లో యాంబులిఫ్ట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ఇవీ చూడండి: జాబ్‌లో చేరిన తర్వాతి రోజే నర్సుకు 'ఉరి'.. ఆస్పత్రిలోనే గ్యాంగ్‌రేప్, హత్య!
బస్టాండ్‌లోనే విద్యార్థినుల ఫైట్.. జుట్టు పట్టుకుని పిడిగుద్దులు