Govt restores e-visa: కరోనా నేపథ్యంలో రెండేళ్ల క్రితం నిషేధం విధించిన టూరిస్ట్ వీసాలను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ఐదేళ్ల కాలపరిమితి ఉండి.. చెల్లుబాటు అయ్యే ఈ-టూరిస్ట్ వీసా హోల్డర్లకు దేశంలోకి అనుమతి ఉంటుందని ప్రకటించింది. వీటితో పాటు అన్ని దేశాలకు చెందిన సాధారణ పేపర్ వీసాలపైనే నిషేధం ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని పేర్కొంది.
Tourists visa restored
వీటితో పాటు అమెరికా, జపాన్ దేశస్థులకు ఇచ్చే దీర్ఘకాల (10 ఏళ్ల) రెగ్యులర్ టూరిస్ట్ వీసాలపైనా ఆంక్షలు ఎత్తివేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ రెండు దేశాల పౌరులకు కొత్తగా పదేళ్ల వీసాలను సైతం జారీ చేస్తామని తెలిపారు.
156 దేశాలకు చెందిన పౌరులకు కేంద్రం ఐదేళ్ల కాలపరిమితి కలిగిన ఈ-టూరిస్ట్ వీసాలను జారీ చేస్తోంది. కరోనా కేసుల నేపథ్యంలో 2020 మార్చిలో వీటిపై సస్పెన్షన్ విధించింది. కాగా, కొత్త వీసాల జారీని సైతం పునరుద్ధరిస్తున్నట్లు కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. 156 దేశాలకు చెందిన అర్హులైన వ్యక్తులకు 2019 మ్యాన్యువల్ ప్రకారం వీసాలను జారీ చేస్తామని తెలిపింది.
చెల్లుబాటు అయ్యే వీసా ఉన్న విదేశీయులు సముద్ర ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్టులు, ఎయిర్పోర్ట్ ఐసీపీల గుండా దేశంలోకి ప్రవేశించవచ్చని కేంద్రం తెలిపింది. భూసరిహద్దులు, నదిమార్గాల ద్వారా వీరిని దేశంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అయితే, ఈ నిబంధనలు అఫ్గానిస్థాన్ పౌరులకు వర్తించవని కేంద్రం తెలిపింది. వీరికి కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా ఈ-ఎమర్జెన్సీ, ఎక్స్-మిస్క్ వీసాలను జారీ చేస్తోందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు..!