హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లాలో దారుణం జరిగింది. కోల్కా గ్రామంలోని గోవింద్ సాగర్ సరస్సులో మునిగి ఏడుగురు యువకులు మరణించారు. మరో నలుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఏడు మృతదేహాలను పోలీసులు శవపరీక్ష నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మృతులందరూ పంజాబ్.. మొహలీ సమీపంలోని బనూడ్ గ్రామానికి చెందినవారు. ఉనా జిల్లాలోని నైనా దేవి ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లారు. అయితే.. గుడికి వెళ్లే ముందు గోవింద్ సాగర్ సరస్సులో స్నానం చేయాలని అనుకున్నారు. నీటిలో దిగిన 11 మందిలో నలుగురు ప్రాణాలతో బయటపడగా.. మిగతా ఏడుగురు దురదృష్టవశాత్తూ చనిపోయారు. శవపరీక్షల అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.
యువకుల మృతితో వారి స్వగ్రామం బనూడ్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరందరూ పేద కుటుంబాలకు చెందినవారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్, పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఇవీ చదవండి: 'ఆమె' నుంచి నగ్నంగా వీడియో కాల్.. ఇంజినీర్‌కు రూ.25లక్షలు లాస్!
ప్రముఖ ప్రొడ్యూసర్ ఇంటిపై ఐటీ దాడులు.. ఆ స్టార్ హీరోతో లింకులు!