అందాల కశ్మీరం (Jammu Kashmir Tourism).. భూతలస్వర్గం. మేఘాలను ముద్దాడుతుండే మంచుపర్వతాలు.. వందల అడుగుల లోతైన లోయలు.. అంతెత్తు నుంచి కిందకు జారుతూ కనువిందు చేసే జలపాతాలు.. ఆహ్లాదపరచే అరుదైన వృక్షాలు.. ఈ సుందర స్వర్గం శీతాకాలం వస్తే మాత్రం మంచు ముసుగేస్తుంది. కిలోమీటర్ల పొడవునా దారులు కనిపించనంత దట్టంగా మంచు పేరుకుపోతుంది. శ్రీనగర్ నుంచి లద్దాఖ్ వరకు ఏడు నెలల పాటు రాకపోకలు నిలిచిపోతాయి. ఈ నేపథ్యంలో చైనా, పాకిస్థాన్‌తో సరిహద్దుల్ని (Pak China Border) పంచుకునే లద్దాఖ్‌లో పొరుగుదేశాల వ్యూహాత్మక ఎత్తుగడలను నిలువరించి దేశ రక్షణకు భరోసా ఇవ్వనున్న ప్రతిష్ఠాత్మక సొరంగమార్గాల పనులు వేగం పుంజుకున్నాయి. శ్రీనగర్ నుంచి లద్దాఖ్ మార్గంలో నిర్మిస్తున్న ఈ రెండు సొరంగాలు కశ్మీర్ మెడలో హారం కానున్నాయి. కాళేశ్వరం పథకంలో ఎక్కువభాగం పనులను అత్యంత వేగంగా పూర్తి చేసిన 'మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' సంస్థ (Megha Engineering News) ఆసియాలోనే పెద్దదైన జోజిలా సొరంగాన్ని (Zojila Tunnel) నిర్మిస్తోంది. కేంద్ర రవాణాశాఖమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) మంగళవారం ఈ పనులను సందర్శించనున్నారు. సోన్‌మార్గ్‌లో సోమవారం మీడియా సమావేశంలో జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఎన్‌హెచ్‌ఐడీసీఎల్) కార్యనిర్వాహక సంచాలకుడు గుర్జిత్ సింగ్ కాంబో ఈ ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు.
కశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుంచి లేహ్, ద్రాస్, కార్గిల్, లద్దాఖ్‌లను కలిపే కీలక మార్గంలో జడ్‌మోర్ (Z-Morh tunnel), జోజిలా సొరంగాలను (Zojila Tunnel) నిర్మిస్తున్నారు. ఇవి పూర్తయితే కశ్మీర్ మరింత వన్నెలీనుతుంది. రక్షణపరంగా గొప్ప ముందడుగు అవుతుంది. గంటల తరబడి ప్రయాణాన్ని తగ్గించడమే కాకుండా, ఏడాది పొడవునా నిరాటంకంగా రాకపోకలు సాగుతాయి. శ్రీనగర్ నుంచి లద్దాఖ్ వరకు 6 వరుసల రహదారి నిర్మాణానికీ ఇవి కీలకం కానున్నాయి. ఘాట్‌రోడ్లు, ప్రమాదకరమైన కొండ మలుపులు, నదులు, జలపాతాల వల్ల రోడ్లు తెగి సంభవించే ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుంది. వీటి నిర్మాణంలో అంతర్జాతీయ ప్రమాణాల మేరకు సాంకేతికతను వినియోగిస్తున్నారు. హిమాలయాలు పర్యావరణపరంగా సున్నితమైనవి కావడం వల్ల కొత్తగా అందుబాటులోకి వచ్చిన కంట్రోల్ బ్లాస్టింగ్‌ను వినియోగిస్తున్నారు. సొరంగ మార్గాల్లో భవిష్యత్తులో ఏవైనా ఆటంకాలు, ప్రమాదాలు ఏర్పడినా సులువుగా బయటపడేందుకు బైపాస్ మార్గాలు, మంచు గ్యాలరీలను నిర్మిస్తున్నారు.
ఈ ఏడాదే అందుబాటులోకి జడ్‌మోర్
సోన్‌మార్గ్‌కు వెళ్లే దారిలో జడ్‌మోర్ సొరంగం (Z-Morh tunnel) రికార్డు కాలంలో పూర్తయింది. 2012లోనే పనులు ప్రారంభమై రూ. 300 కోట్లు ఖర్చయినా 500 మీటర్లే తవ్వారు. 2018లో కేంద్ర ప్రభుత్వం వీటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మొత్తం 6.5 కిలోమీటర్ల పనుల్ని 9 నెలల్లోనే పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 2,300 కోట్లు. వచ్చే శీతాకాలంలోనే సోన్‌మార్గ్‌కు రాకపోకలు ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. ఈ మార్గంలో 3 గంటల ప్రయాణ కాలం తగ్గనుంది.
14.15 కిలోమీటర్ల పొడవు జోజిలా
కశ్మీరు లోయను (Kashmir Valley News) లద్దాఖ్‌తో అనుసంధానించే మార్గంలో జోజిలా సొరంగం (Zojila Tunnel) నిర్మిస్తున్నారు. పొడవు 14.15 కిలోమీటర్లు. 7.5 మీటర్ల ఎత్తు, 9.5 మీటర్ల వెడల్పు. రూ.4,600 కోట్లతో ఈపీసీ పద్ధతిలో మేఘ ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) పనులను చేపట్టింది. 2026 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. లద్దాఖ్ నుంచి పశ్చిమం వైపు 123 మీటర్లు, శ్రీనగర్ నుంచి తూర్పు వైపు 368 మీటర్లు తవ్వకం పనులు పూర్తయ్యాయి. ఆసియా ఖండంలోనే పెద్ద టన్నెల్ ఇది. లోపలికి గాలి, వెలుతురు అందించే వెంటిలేషన్లు పెడుతున్నారు. ఇది పూర్తయితే సోన్‌మార్గ్ నుంచి లద్దాఖ్ ప్రయాణంలో మూడున్నర గంటలకుపైగా సమయం కలిసి వస్తుంది.
ఇదీ చూడండి: భూతల స్వర్గంలో దేశీయ పర్యటకుల సందడి