Free Bus For Woman In Karnataka : రాష్ట్రంలోని మహిళలంతా ఉచితంగా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించేలా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిన కర్ణాటక కాంగ్రెస్ సర్కార్.. దానిని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పురుషులకు 50 శాతం సీట్ల రిజర్వేషన్‌తో సహా కొన్ని షరతులతో ఈ శక్తి పథకం.. జూన్ 11వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది.
Free Bus Facility For Women In Karnataka : ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. లబ్ధిదారులు కర్ణాటకకు చెందిన వారై ఉండాలి. మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. రాష్ట్రంలో తిరిగే బస్సులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అంతర్రాష్ట్ర బస్సులకు ఈ శక్తి పథకం వర్తించదు. రాజహంస, నాన్-ఏసీ స్లీపర్, వజ్ర, వాయు వజ్ర, ఐరావత్, ఐరావత్ క్లబ్ క్లాస్, ఐరావత్ గోల్డ్ క్లాస్, అంబారీ, అంబారీ డ్రీమ్ క్లాస్, అంబారీ ఉత్సవ్ ఫ్లై బస్, ఈవీ పవర్ ప్లస్ వంటి అన్ని లగ్జరీ బస్సులను పథకం నుంచి మినహాయించారు.
Free Bus For Womens In Bangalore : బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC), కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (KSRTC), నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NWKRTC), కల్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (KKRTC) పరిధిలో నడుపుతున్న బస్సుల్లో ఈ శక్తి పథకం ప్రయోజనాలను పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. బీఎమ్‌టీసీ కాకుండా మిగతా మూడు ఆర్టీసీలకు సంబంధించిన బస్సుల్లో పురుషులకు 50 శాతం సీట్లు రిజర్వ్ చేస్తారు. మహిళా ప్రయాణికులు ప్రయాణించే దూరాన్ని బట్టి.. ఆయా రోడ్డు ట్రాన్స్ప్రోర్ట్ కార్పొరేషన్లకు రీయింబర్స్మెంట్ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అలాగే రాబోయే మూడు నెలల్లో మహిళలు 'సేవా సింధు' ప్రభుత్వ పోర్టల్ ద్వారా శక్తి స్మార్ట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. శక్తి స్మార్ట్ కార్డులు జారీ చేసే వరకు లబ్ధిదారులు.. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులను ఉపయోగించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Karnataka Election Results : ఈ ఏడాది మే 10న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 224 స్థానాలు అసెంబ్లీ స్థానాలకుగాను మే 10న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 135 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. భారతీయ జనతా పార్టీ 66 సీట్లు, మాజీ ప్రధాని దేవెగౌడ సారథ్యంలోని జేడీఎస్ 19 స్థానాలు గెలుపొందాయి. దీంతో కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించారు.
కర్ణాటక ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ప్రధానంగా ఐదు హామీలు ఇచ్చింది. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు నెలకు రూ. 2 వేలు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచితంగా పది కిలోల బియ్యం, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలు ఇచ్చింది. ఆ 5 ప్రధాన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.50వేల కోట్లకుపైగా భారం పడనుందని అంచనా.