Four arrested in Sathvik suicide case: హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో బుధవారం ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం వేశారు. అయితే మృతుని వద్ద లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా నలుగురిపై కేసు నమోదు చేశారు. తాజాగా సాత్విక్ మృతికి కారణంగా భావిస్తున్నఆ నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇంటర్ విద్యార్థి సాత్విక్ మృతికి కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్లు, ఆచార్య, కృష్ణా రెడ్డి వార్డెన్‌లు నరేశ్, జగన్‌లపై ఐపీసీ 305 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నలుగురికి నార్సింగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రాజేంద్ర నగర్ ఉప్పర్‌పల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అనంతరం నలుగురు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు : నలుగురు అధ్యాపకుల వేధింపులు తట్టుకోలేకనే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు సాత్విక్ రాసినట్లు ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. దాంట్లో అమ్మనాన్న.. నేను ఈ పనిచేస్తున్నందుకు క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. మీరు బాధపడితే నా ఆత్మ శాంతించదు. అన్నయ్య.. అమ్మనాన్నలను నువ్వే బాగా చూసుకోవాలి. నేను లేనిలోటును వారికి రానీయకు. ఈ మెంటల్ టార్చర్ చనిపోతున్నా. కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, ఇంఛార్జ్, లెక్చరర్ల వేధింపులు తట్టుకోలేకపోతున్నా. ఆ నలుగురు హాస్టల్లో విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. వాటిని తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. ఇలాంటి వేధింపులు మరెవరికీ రాకూడదని కోరుకుంటున్నా. తనను వేధించిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని సాత్విక్ రాసిన ఆ లేఖలో ఉంది. ఆ లేఖతో పాటు, సాత్విక్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఆ నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు లేఖపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం : నిన్న కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకుల టార్చర్ వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఇంటర్ విద్యార్థి సాత్విక్ రాసిన సూసైడ్ నోట్‌ను నార్సింగి పోలీసులు పరిశీలించారు. లేఖపై స్పష్టత కోసం సూసైడ్ నోట్‌ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించారు. మృతి చెందిన విద్యార్థి చేతిరాతను సూసైడ్ నోట్లో ఉన్న రాతను కచ్చితత్వంతో పోల్చేందుకు పోలీసులు నిపుణుల అభిప్రాయం సేకరిస్తున్నారు. ఇదే ఘటనపై నిన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నార్సింగి కళాశాల ప్రాంగణానికి చేరుకుని నిరాహార దీక్షకు దిగి.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఇంటర్‌బోర్డు వద్ద సాత్విక్ మృతికి నిరసనగా ఏబీవీపీ, ఆప్ కార్యకర్తలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి: