EWS Supreme Court Decision : ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 10 శాతం కోటా(రిజర్వేషన్లు) కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడంపై భాజపా స్పందించింది. ఈ తీర్పు.. దేశంలోని పేదలకు సామాజిక న్యాయం అందించాలనే సంకల్పంతో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన విజయమని భాజపా ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ అన్నారు. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రమాజీ మంత్రి ఉమాభారతి కోరారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల దేశంలో ఐక్యత నెలకొంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
స్వాగతించిన కాంగ్రెస్..
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీం ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కాకుండా ఇతర కులాలలో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10శాతం రిజర్వేషన్ అందించే 103వ రాజ్యాంగ సవరణను సుప్రీం సమర్థిస్తూ తీర్పును ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో 2006లోనే ఆర్థికంగా వెనకబడిన వర్గాల రిజర్వేషన్లపై సిన్హో కమిషన్ను వేశామని పేర్కొన్నారు. ఆ కమిటీ 2010లో నివేదికను సమర్పించిందని జైరాం రమేశ్ తెలిపారు. విస్తృత సంప్రదింపుల తర్వాత 2014నాటికి బిల్లు సిద్ధమైందని ఆయన వెల్లడించారు.
సామాజిక పోరాటానికి ఎదురుదెబ్బ..
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పు.. సామాజిక న్యాయం కోసం శతాబ్దాలుగా సాగుతున్న పోరాటానికి ఎదురుదెబ్బగా ఆయన అభివర్ణించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశంపై తదుపరి చర్య తీసుకునే ముందు న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటానని స్టాలిన్ అన్నారు.
అర్హులైన వారికి ప్రయోజనాలు..
ఆర్థికంగా వెనకబడి.. కుల రిజర్వేషన్ వర్తించనివారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పిస్తామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. రాష్ట్రంలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. అర్హులైనవారు 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటా కింద ప్రయోజనాలు పొందవచ్చని ఫడణవీస్ అన్నారు.
చరిత్రాత్మక నిర్ణయం..
కాగా, సుప్రీంకోర్టు తీర్పును టీఎంసీ సీనియర్ నేత, ఎంపీ సౌగతా రాయ్ సమర్థించారు. ఈ నిర్ణయం చరిత్రత్మాకమైనదిగా ఆయన అభివర్ణించారు. దేశంలో ఆర్థిక సమానత్వం సాధించేందుకు ఇదొక పెద్ద ముందడుగు అని అన్నారు. మరోవైపు టీఎంసీ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్రే భిన్నంగా స్పందించారు. 'అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.. ప్రస్తుతం దీనిపై మేం ఏమీ చెప్పలేం' అని ఆయన అన్నారు.
ఇదీ తీర్పు..
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో 10 శాతం కోటా(రిజర్వేషన్లు) కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం సోమవారం ఈమేరకు మెజార్టీ తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ త్రివేది, జస్టిస్ పార్దీవాలాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఐదుగురు న్యాయమూర్తుల్లో ముగ్గురు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించారు. మిగతా ముగ్గురు న్యాయమూర్తులతో జస్టిస్ రవీంద్రభట్, జస్టిస్ యూయూ లలిత్ విభేదించారు. ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్.. సామాజిక న్యాయం, ప్రాథమిక సూత్రాన్ని బలహీనపరుస్తుందని జస్టిస్ రవీంద్రభట్ వ్యాఖ్యానించారు. సమానత్వ సూత్రానికి భంగం కలిగేలా ఉందని ఆయన పేర్కొన్నారు. జస్టిస్ రవీంద్రభట్తో జస్టిస్ యూయూ లలిత్ ఏకీభవించారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అనేక మంది సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన వ్యాజ్యాన్ని 'జనహిత్ అభియాన్' అనే సంస్థ 2019లో దాఖలు చేసింది. 103వ సవరణ.. రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని మార్చేస్తోందని పేర్కొంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వీటితో పాటు సుమారు 40 వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఉన్నత వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం 2019, ఫిబ్రవరి 1న అమలులోకి వచ్చింది. ఫలితంగా వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న అగ్రవర్ణ పేదలకు లబ్ధి చేకూరనుంది.
ఇవీ చదవండి: EWS 10 శాతం రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు సమర్థన