Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో అపశ్రుతి తలెత్తింది. రాహుల్ గాంధీ చేపట్టిన పాద యాత్ర.. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని న్యూ మోక ప్రాంతంలో కొనసాగుతుంది. ఈ యాత్రలో భాగంగా పార్టీ జెండాలను స్తంభానికి కడుతుండగా.. కరెంట్ షాక్ కొట్టి ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలాలు పరమర్శించారు. క్షతగాత్రులు ఒక్కొక్కరికీ రాహుల్ గాంధీ రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు.
అసలు ఏం జరిగిందంటే.. ఓ వ్యక్తి స్తంభానికి జెండా కడుతుండగా.. ప్రమాదవశాత్తు జెండా విద్యుత్ లైన్‌కు తగిలింది. ఈ ప్రమాదంలో మోకా గ్రామ పంచాయతీ అధ్యక్షుడు రామన్నతోపాటు నలుగురికి గాయాలయ్యాయి. వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే నాగేంద్ర వెంటనే క్షతగాత్రులను మోకా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రాహుల్ గాంధీకి సమీపంలోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. రాహుల్ గాంధీ వెంట ఉన్న భద్రతా బృందం.. ఆయనకు రక్షణ కల్పించింది.
'ఈరోజు జోడో యాత్రలో భాగంగా ఓ దురదృష్టకర ఘటన జరిగింది. మా స్నేహితుల్లో కొందరు ఓ స్తంభానికి జెండాలు కట్టే సమయంలో.. కరెంట్ షాక్‌కు గురయ్యారు. వెంటనే వారిని బళ్లారిలోని జనరల్ ఆస్పత్రిలో చేర్పించాం. పెను ప్రమాదం తప్పింది. వారి ఆత్మస్థైర్యం చూసి నేను చాలా సంతోషిస్తున్నాను' అని రాహుల్ గాంధీ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. గాయపడిన వారికి అవసరమైన సహాయం అందించాలని, వారు వెంటనే కోలుకునేలా అన్ని చర్యలు తీసుకోవాలని నేతలకు రాహుల్ సూచించారు. ఇదే విషయంపై ఏఐసీసీ జనరల్ సుర్జేవాలా సైతం ట్వీట్ చేశారు.
రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం బళ్లారి జిల్లాలో సాగుతున్న యాత్ర.. ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. కాగా, శనివారం బళ్లారిలో ఏర్పాటు చేసిన మహా సమ్మేళనానికి భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. 17వ రోజు భారత్ జోడో యాత్ర ఈ ఉదయం సంగనకల్లులో ప్రారంభమై బెన్నికల్లు వద్ద ముగుస్తుంది.