National Herald case: నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సీనియర్ నేత రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. కేసు విచారణ కోసం ఈనెల 8న సోనియాను హాజరుకావాలని సూచించింది. రాహుల్ గాంధీని మాత్రం కాస్త ముందుగా జూన్ 2నే హాజరు కావాలని ఈడీ కోరింది. అయితే రాహుల్ విదేశాల్లో ఉన్నందున ఆయన జూన్ 5 తర్వాత విచారణకు వస్తానని ఈడీకి చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
సోనియా, రాహుల్‌కు ఈడీ సమన్లు పంపడం కాంగ్రెస్, భాజపా మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ప్రజా వ్యతిరేక ఉద్యమ స్వరాన్ని అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ పెంపుడు సంస్థగా ఈడీ పని చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భాజపా ఎన్ని ప్రతీకార చర్యలకు దిగినా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా సోనియా, రాహుల్‌కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ మరో నేత అభిషేక్ మను సింఘ్వి కూడా ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. తప్పుడు కేసులు బనాయించి, పిరికిపంద కుట్రలు చేసినంత మాత్రాన విజయం సాధించలేరని మోదీ తెలుసుకోవాలని విమర్శించారు. దీనంతటికీ సూత్రధారి ఆయనే అని ఆరోపించారు. స్వాతంత్య్ర ఉద్యమ గొంతుక అయిన నేషనల్ హెరాల్డ్ పత్రికను ఈడీ ఆపలేదని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీని భయపెట్టడం కూడా సాధ్యం కాదని సింఘ్వీ అన్నారు. కాంగ్రెస్ నాయకత్వం ఇలాంటి వాటికి భయపడదని, ఎవరి ముందూ తలవంచదని పేర్కొన్నారు. ఈడీ విచారణకు సోనియా హాజరై అన్ని వివరాలు వెల్లడిస్తారని చెప్పారు.
నడ్డా రియాక్షన్: భాజపా జాతీయ అధ్యక్షుడు డేపీ నడ్డా కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టారు. ఏ నేరగాడు తాను నేరస్థుడినని చెప్పుకోడని, వాళ్లు కూడా అంతే అని సోనియా, రాహుల్‌ను ఉద్దేశించి అన్నారు. డాక్యుమెంట్లే ఆధారాలని పేర్కొన్నారు. ఛార్జ్‌షీట్ దాఖలు చేసినప్పుడు ఎవరైనా దాన్ని కొట్టివేయాలని కోర్టును ఆశ్రయిస్తారని, కానీ వాళ్లు బెయిల్ కావాలని అడిగారని చెప్పుకొచ్చారు. దీని అర్థం వాళ్లు తప్పు చేసినట్లే అవుతుందని అన్నారు.
ఏంటీ కేసు?
కాంగ్రెస్‌కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో స్వామి కేసు వేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్‌లో ఆరోపించారు.
ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్‌ను ఈడీ ప్రశ్నించింది.
ఇవీ చదవండి: శరవేగంగా అయోధ్య రామాలయం.. 'గర్భగుడి' నిర్మాణానికి యోగి శంకుస్థాపన