Sanjay raut ed: శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. మరింత లోతైన విచారణ కోసం రౌత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సాయంత్రం ప్రకటించారు.
ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో సీఐఎస్‌ఎఫ్ అధికారులతో పాటు ఈడీ బృందం ముంబయిలోని రౌత్ ఇంటికి చేరుకుంది. పాత్రచాల్ భూ కుంభకోణానికి సంబంధించి అక్రమ నగదు చలామణి కేసులో రౌత్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈడీ అధికారుల సోదాలపై సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు.
"ఎట్టి పరిస్థితుల్లో శివసేనను వీడేది లేదు. చనిపోయినా సరే.. నేనెవరికీ తలొగ్గబోను. నాకు ఎలాంటి కుంభకోణంతో సంబంధం లేదు. బాలాసాహెబ్ ఠాక్రేపై ప్రమాణం చేసి ఈ విషయం చెబుతున్నాను. బాలాసాహెబ్ మాకు ఎలా పోరాడాలో నేర్పారు. శివసేన కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటా" అని ట్వీట్ చేశారు.
రౌత్ వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. ఏ తప్పూ చేయకపోతే.. ఈడీ విచారణకు రౌత్ ఎందుకు భయపడుతున్నారని ఎమ్మెల్యే రామ్ కడం ప్రశ్నించారు. విలేకరుల సమావేశం నిర్వహించడానికి సమయం ఉన్నప్పుడు ఈడీ ముందుకు వెళ్లడానికి ఎందుకు లేదని నిలదీశారు.
సంజయ్ రౌత్‌ను జులై 1న ఈడీ అధికారులు దాదాపు 10 గంటల పాటు ప్రశ్నించారు. తర్వాత మరో రెండు సార్లు విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు. కానీ, ఆయన హాజరు కాలేదు.
పాత్రచాల్ కుంభకోణంతో ఆయన సతీమణి వర్షా రౌత్ సహా, మరికొంతమంది సన్నిహితులకు సంబంధం ఉందన్నది ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలో ఏప్రిల్‌లో వర్షా రౌత్‌కు చెందిన రూ.11.15 కోట్లు విలువ చేసే ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆయన సన్నిహితులకు సంబంధించిన ఆస్తులను కూడా విచారణ సంస్థ జప్తు చేసింది. రూ.1,034 కోట్ల పాత్రచాల్ భూకుంభకోణం కేసుకు సంబంధించి ఇప్పటికే రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఇవీ చదవండి: 'హక్కులు, విధులపై అవగాహనతోనే రాజ్యాంగబద్ధ అభివృద్ధి'
'సారీ అమ్మ, నాన్న.. అతడ్ని ప్రేమించా.. ఇక నా వల్ల కాదు'.. యువకుడి సూసైడ్ లెటర్