గుజరాత్‌లోని సూరత్‌లో ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ పేలింది. స్కూటీకి ఛార్జింగ్ పెట్టిన సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి.
సచిన్ ప్రాంతంలోని మహాలక్ష్మి నగర్ సొసైటీలో నివాసముంటున్న జయలాల్ మునీలాల్ బింద్ (58).. కిరాణ దుకాణం నడుపుతున్నాడు. మధ్యాహ్నం సమయంలో బింద్ స్నేహితుడు మహేశ్ తన స్కూటీకి కిరాణ షాపు వద్ద ఛార్జింగ్ పెట్టాడు. అయితే ఒక్కసారిగా స్కూటీ బ్యాటరీలు పేలి.. దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో జయలాల్కు తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరు చిన్నారులు స్వల్పంగా గాయపడ్డారు.
పేలుడు శబ్దాన్ని విన్న స్థానికులు.. దుకాణం వద్దకు చేరుకున్నారు. జయలాల్తో పాటు చిన్నారులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి దుకాణంలోని వస్తువులన్నీ చాలా వరకు కాలిపోయాయి. 'మా ఇంటికి ఎదురుగానే జయలాల్ దుకాణం ఉంది. ఈరోజు మధ్యాహ్నం మేం భోజనం చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. బాంబు పేలుడులా అనిపించింది. నేను, నా స్నేహితులు అటు వైపు పరిగెత్తాం. నీళ్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాం' అని జయలాల్ బంధువు తెలిపారు.