మద్యం మత్తులో రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఓ గ్యాంగ్‌లోని యువకుడి ఎడమ ముంజేయి తెగి పడిపోయింది. దాన్ని ఓ వీధికుక్క ఎత్తుకెళ్లిన ఘటన బెంగుళూరులోని మహాలక్ష్మి లేఅవుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. బీబీఎమ్ చదువుతున్న ప్రజ్వల్ తన స్నేహితులతో కలిసి కురుబరహళ్లిలోని కదంబ బార్‌కు వెళ్లాడు. అదే సమయంలో హరీష్ అనే వ్యక్తి ప్రజ్వల్ పక్క టేబుల్లో తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్నాడు. అయితే ప్రజ్వల్‌కు హరీష్, యోగేష్‌తో ఉన్న పాత కక్షల కారణంగా వాగ్వాదం జరిగింది. ఇది గమనించిన బార్ యజమాని రెండు గ్రూపులను బయటకు వెళ్లగొట్టాడు.
అర్ధరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ప్రజ్వల్, అతడి స్నేహితులు ఓ షాపు వద్ద నిల్చున్నారు. అనంతరం మళ్లీ హరీష్, అతడి గ్యాంగ్ కార్లో వచ్చి ప్రజ్వల్‌తో గొడవకు దిగారు. ఆ తర్వాత కొడవలి లాంటి పదునైన ఆయుధంతో ప్రజ్వల్‌పై దాడి చేశారు. దీంతో ప్రజ్వల్ ఎడమ ముంజేయి తెగిపోయి కిందపడింది. దీంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించారు.
అయితే మత్తులో ఉన్న సమయంలో జేసీబీ ఢీకొట్టిందని, అందువల్లనే చేతికి గాయం అయిందని పోలీసులకు చెప్పాడు. కాసేపాగి మాట మార్చాడు. ఓ గ్యాంగ్ తనపై దాడి చేసిందని, తెగిపోయిన చేతిని వారు తీసుకెళ్లారని చెప్పాడు. బాధితుడి ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి వెళ్లి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఇరు గ్యాంగ్‌లు గొడవ పడిన దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. అయితే తెగిపోయిన చేతిని హరీష్ గ్యాంగ్ తీసుకెళ్లలేదు. అక్కడున్న ఓ వీధి కుక్క నోట కరచుకుని తీసుకెళ్లింది. దీంతో పోలీస్ డాగ్‌స్క్వాడ్‌తో వీధి కుక్క ఎత్తుకెళ్లిన చేయి కోసం గాలించారు. కానీ అది దొరకలేదని పోలీసులు తెలిపారు. హరీశ్‌తో పాటు ఈ ఘటనతో సంబంధమున్న కొంతమంది యువకులని మహాలక్ష్మి లేఅవుట్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి : బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు మూర్ఛ
తండ్రి డ్రగ్స్ బానిస.. స్టేషన్లో పిల్లలు.. పసికందుకు పాలిచ్చిన పోలీస్ అమ్మ