దేవుడు మనకు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడని పెద్దలు అంటుంటారు. ఓ బంగ్లాదేశీ చిన్నారి విషయంలో సరిగ్గా అదే జరిగింది. ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని అక్కున చేర్చుకున్న వైద్యులు.. విజయవంతంగా ఆపరేషన్ చేసి కాపాడారు. చిన్నారి మెదడులో ఉబ్బిన భాగాన్ని తొలగించి తలకు సరైన ఆకృతిని ఇచ్చారు వైద్యులు. ఈ ఘటన దిల్లీలోని ఎయిమ్స్‌లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ మూడు నెలల చిన్నారి జెయింట్ ఆక్సిపిటల్ ఎన్సెఫలోసెల్ అనే పుట్టుకతో వచ్చే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. దీని వల్ల పుర్రె వెనుక భాగంలో కొన్ని టిష్యూస్ బెలూన్లా ఉబ్బాయి. వైద్యులను సంప్రదించగా.. సరైన సమయంలో ఆపరేషన్ చేయకపోతే అవి పేలి చిన్నారి మరణించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. దీంతో దిల్లీ ఎయిమ్స్ వెళ్లి తమ బిడ్డ పరిస్థితిని వివరించారు. వైద్య పరీక్షల తర్వాత శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. డిసెంబర్ 12న దాదాపు మూడు గంటలు పాటు శస్త్రచికిత్స చేసి.. మెదడులో ఉబ్బిన అనవసరమైన భాగాన్ని తొలగించారు. ఆ తర్వాత భవిష్యత్తులో మెదడు పెరగడం కోసం క్రానియోప్లాస్టీ ఆపరేషన్‌ను నిర్వహించారు.