దేశంలో గత కొద్ది వారాలుగా కొవిడ్ పాజిటివిటీ రేటు(Covid positivity rate) 10శాతంకన్నా ఎక్కువ ఉన్న జిల్లాల్లో వైరస్(Corona virus) కట్టడికి కఠిన ఆంక్షలు విధించాలని సూచించింది కేంద్రం. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా అడ్డుకోవాలని.. కేసులు, పాజిటివిటీ రేటు భారీగా పెరుగుతోన్న 10 రాష్ట్రాలను ఆదేశించింది.
దేశవ్యాప్తంగా 46 జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతంకన్నా ఎక్కువగా ఉండగా.. మరో 53 జిల్లాల్లో 5-10 శాతంగా ఉంది. ఈ క్రమంలో కొవిడ్ కేసులను గుర్తించేందుకు పరీక్షలను పెంచాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఆయా జిల్లాల్లో కరోనా కట్టిడిలో అలసత్వం వహిస్తే దుర్భర పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరించింది.
కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, అసోం, మిజోరాం, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, మణిపుర్ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేస్ భూషణ్. కేసుల గుర్తింపు, కట్టడి, నిర్వహణపైనా సమీక్షించారు.
" ఆయా రాష్ట్రాల్లో 80 శాతానికిపైగా కేసులు హోంఐసోలేషన్లో ఉన్నట్లు చెప్పారు. అలాంటి వారు బయటకి రాకుండా, ఇతరులకు వైరస్ వ్యాప్తి చేయకుండా నిఘా వేస్తూ.. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. ఐసోలేషన్‌లో ఉన్నవారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. చికిత్స అసరమైన వారిని సమయానికి ఆసుపత్రికి తరలించేలా చూడాలి. ఈ అంశంపై ఇప్పటికే అనుసరించాల్సిన విధానాలను రాష్ట్రాలకు తెలియజేశాం. అలాగే.. 10 శాతంలోపు పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలపైనా దృష్టి సారించాలి. ఆయా జిల్లాల ప్రజల రక్షణకు కట్టుబడి.. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలి. కేంద్రం నుంచి రాష్ట్రాలకు కనీస పరిమాణంలో వ్యాక్సిన్ల పంపిణీ జరుగుతోంది. అయితే.. వినియోగాన్ని అనుసరించి అదనంగా ఆరోగ్య శాఖ సరఫరా చేస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలి. "
- కేంద్ర ఆరోగ్య శాఖ.
జిల్లాల వారిగా సొంత సెరోసర్వేలను నిర్వహించాలని రాష్ట్రాలను కోరింది కేంద్ర ఆరోగ్య శాఖ. జాతీయ స్థాయిలో నిర్వహించే సర్వే.. అందుకు భిన్నంగా ఉంటుందని పేర్కొంది. 80 శాతం మరణాలు 45-60ఏళ్ల వయసు వారిలోనే సంభవిస్తున్న నేపథ్యంలో వారికి వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ సూచించారు. అనవసర ప్రయాణాలను తగ్గించాలని, పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడటాన్ని నిరోధించాలని కోరారు.