మహారాష్ట్ర ధులేలో అరుదైన సర్జరీ జరిగింది. ఓ వ్యక్తి కంట్లో నుంచి ఆరు అంగుళాల కత్తిని వైద్యులు బయటకు తీశారు. బావూసాహెబ్ హీరే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ శస్త్రచికిత్స జరిగింది. ఈ చికిత్స నిర్వహించిన వైద్యులపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
నందుర్బార్ జిల్లా తలోడా తాలుకాకు చెందిన విలన్ సోమా భిలావే(41) కంట్లో ప్రమాదవశాత్తూ కత్తి గుచ్చుకుంది. వెంటనే అతడిని ధూలేలోని ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. పరిస్థితి విషమంగా ఉందని నిర్ధరించుకున్న వైద్యులు.. అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వెంటనే సర్జరీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. అర్ధరాత్రి 2.30 గంటలకు బాధితుడు ఆస్పత్రిలో చేరగా.. చకచకా శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేసుకొని ఉదయం ఆపరేషన్ పూర్తి చేశారు.
బాధితుడి కంట్లోకి కత్తి లోతుగా దిగిందని వైద్యులు తెలిపారు. 'బాధితుడు తీవ్ర నొప్పిని అనుభవించాడు. సరిగా చూడలేకపోయాడు. చెవులు, ముక్కు, గొంతుకు ఏమైనా గాయాలు అయ్యాయేమోనని అనుకున్నాం. అత్యంత సవాల్‌తో కూడిన క్లిష్టమైన సర్జరీకి ఏర్పాట్లు చేసుకున్నాం. విజయవంతంగా సర్జరీ పూర్తైంది' అని వైద్యులు వివరించారు.
అయితే, తొలుత కంట్లో ఉన్న వస్తువును లోహపు పట్టీ అని వైద్యులు భావించారు. కానీ, తొలగించిన తర్వాతే అది కత్తి అని తెలిసింది. డాక్టర్ ముకర్రమ్ ఖాన్, ఆయన బృందం విజయవంతంగా సర్జరీని పూర్తి చేశారు. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. వైద్యులపై అన్నివర్గాల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.