దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధావాకర్ హత్య కేసులో దిల్లీ పోలీసులు అభియోగపత్రం దాఖలుచేశారు. హత్య జరిగినరోజు ఆఫ్తాబ్ పూనావాలాకు ఇష్టం లేకుండా శ్రద్ధావాకర్ తన స్నేహితుల్లో ఒకర్ని కలిసేందుకు వెళ్లినట్లు తెలిపారు. ఆ తర్వాత ఉన్మాదిగా మారిన నిందితుడు ఘాతుకానికి ఒడిగట్టినట్లు దక్షిణ మండలం సంయుక్త పోలీసు కమిషనర్ మీను చౌదరీ తెలిపారు. ఐపీసీ సెక్షన్ 302, 201 ప్రకారం అభియోగపత్రం దాఖలు చేసినట్లు చెప్పారు. 150మందికిపైగా సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసినట్లు పేర్కొన్నారు. దిల్లీ పోలీసులు ఈ మేరకు 6వేల 6వందల 29 పేజీల అభియోగపత్రాన్ని సాకేత్ కోర్టుకు సమర్పించారు. శ్రద్ధావాకర్ హత్యకు నిందితుడు ఐదు రకాల ఆయుధాలను వినియోగించాడని, హత్యచేసిన తర్వాత రంపంతో మృతదేహాన్ని ముక్కలుగా కోసి గురుగ్రామ్, దక్షిణ దిల్లీలోని డంపింగ్ యార్డు ప్రాంతాల్లో విసిరేశాడని పోలీసులు తెలిపారు.
నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా తనతో సహజీవనం చేస్తున్న కాలర్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధావాకర్‌ను గతేడాది మేలో గొంతు పిసికి చంపి.. ఆ తర్వాత ఆమె శవాన్ని 30కిపైగా ముక్కలుగా కోశాడు. కొన్నిరోజులపాటు ఆమె శరీరం ముక్కలను వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు. ఇవాళ్టితో నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా జ్యుడీషియల్ కస్టడీ ముగియటంతో పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. దీంతో న్యాయమూర్తి ఫిబ్రవరి 7 వరకు కస్టడీ పొడిగించారు.
ఇవీ చదవండి: