Stone Pelting On Swati Maliwal House: దిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి మాలివాల్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఆమె ఇంటి ఆవరణలో ఉన్న కార్లను సైతం ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని స్వాతి.. ఆదివారం ట్విట్టర్ వేదికగా తెలిపారు. "నేను, మా అమ్మ ఇంట్లో లేని సమయంలో కొందరు దుండగులు రాళ్ల దాడి చేశారు. కార్లను ధ్వంసం చేశారు. అదృష్టవశాత్తు మేము ఇంట్లో లేము. లేకపోతే ఏమయ్యేదో ఎంటో? మీరేం చేసినా భయపడేది లేదు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.
'దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ సురక్షితంగా లేరు..'
అయితే ఈ ఘటనపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, దిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ స్వాతి సురక్షితంగా లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిభద్రతలపై తక్షణమే దృష్టి సారించాలని దిల్లీ లెప్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కేజ్రీవాల్ కోరారు.
అత్యాచార బెదిరింపులు..
కొద్దిరోజుల క్రితం.. హిందీ బిగ్‌బాస్-16 కంటెస్టెంట్ సాజిద్ ఖాన్‌ను వెంటనే ఆ షో నుంచి బయటకు పంపించాలని స్వాతి మాలివాల్.. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. దాంతోపాటు ఆమె సాజిద్ ఖాన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రైమ్ టైమ్‌లో వచ్చే బిగ్‌బాస్ షోలో సాజిద్ ఖాన్ లాంటి 'లైంగిక వేటగాడు' ఉండటం సరికాదు అని రాసుకొచ్చారు. దీంతో ఆమెను రేప్ చేస్తామంటూ పలువురు దుండగులు సోషల్ మీడియా వేదికగా మెసేజ్‌లు చేస్తున్నారు. అయితే "మేము చేసే పని ఆపడానికే.. వారు ఇలా చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయమని దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాను. దర్యాప్తు చేసి దీని వెనుక ఎవరున్నారో వారిని అరెస్ట్ చేయాలని కోరబోతున్నా" అంటూ స్వాతి ట్వీట్ చేశారు.